దాదాపు 6800 ఏళ్ల క్రితం నాటి ఓ భారీ గుడ్డు శిలాజం అంటార్కటికా సేమాల్ ద్వీపంలో లభ్యమైంది. గాలి తీసేసిన ఫుట్‌బాల్ ఆకారంలో ఉన్న ఈ గుడ్డు.. డైనోసార్ల కాలానికి చెందిన సముద్ర సరీసృపాల అండంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఇదిప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పురాతన గుడ్డుగా పేరు సంపాదించుకుంది.
ఇప్పటి వరకు దొరికిన పక్షులు, మొసళ్లు, అనేక డైనోసార్‌లు ధృడమైన పైకప్పున్న గుడ్లను పెట్టినట్టు ఆధారాలున్నాయి. కానీ, అంటార్కిటికాలో దొరికిన ఈ గుడ్డు మాత్రం మృదువైన పెంకును కలిగి ఉంది. దాదాపు 28x18 సెం.మీ పరిమాణంలో ఉంది. దీంతో మోసాసార్.. లేదా పొడవాటి మెడ గల ప్లీసియోసార్‌ల జాతికి చెందిన సముద్ర జీవి ఏదైనా ఈ గుడ్డును పెట్టి ఉంటుందని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ఈ గుడ్డు చూడటానికి ఫుట్బాల్లాగా కనిపిస్తోంది. కుంగిన దాని ఉపరితలంపై అనేక ముడతలు ఉన్నాయి. ఈ గుడ్డు సముద్రపు అడుగు భాగంలో కదలకుండా ఉండటం వల్లే ఒక వైపు చదును చేసినట్టుగా ఉన్న దాని ఆకారం ఉంది. బల్లి, పాముల గుడ్ల మాదిరిగానే దీని పైకప్పు కూడా చాలా సన్నగా ఉంది."
-లూకస్ లెజెండ్రే, శిలాజ నిపుణుడు, టెక్సాస్ వర్సిటీ.
గుడ్డులో పిండ అవశేషాలు లేవు, దానికి జన్మనిచ్చిన జంతువు అస్థిపంజరం ఆ దరిదాపుల్లో దొరకలేదు. దీంతో ఈ భారీ గుడ్డు ఏ జీవి పెట్టిందోనని లోతైన పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇదీ చదవండి:శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!