Vivek Ramaswamy Presidential Campaign : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకున్నారు. అయోవా ప్రైమరీలో నిరాశజనక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ ప్రకటించారు. అయోవాలోని డెస్ మోయినెస్లో విలేకరులతో మాట్లాడిన ఆయన- ట్రంప్‌ను గెలిపించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
నాలుగో స్థానంలో వివేక్
అయోవా ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన మెజారిటీ దక్కించుకున్నారు. 51 శాతం ఓట్లు సాధించారు. రెండో స్థానంలో ఉన్న రాన్ డిశాంటిస్‌కు 21.2 శాతం ఓట్లు, మూడో స్థానంలో ఉన్న నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి. 7.7 శాతం ఓట్లతో వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. అయోవా కాకసస్లో విజయం నేపథ్యంలో ట్రంప్‌నకు ఫోన్ చేసి అభినందించినట్లు వివేక్ తెలిపారు. భవిష్యత్‌లో తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలోకి దిగి అనేక మంది దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్నవారిపై విమర్శలు గుప్పిస్తూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. తన వాక్చాతుర్యం, ఏ అంశంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడటం వంటి అంశాలు ఆయనను రేసులో ప్రత్యేకంగా నిలబెట్టాయి. దీంతో సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కాగా, ట్రంప్ పట్ల మాత్రం తొలి నుంచీ సానుకూలంగానే ఉన్నారు వివేక్. ట్రంప్‌ను 21వ శతాబ్దపు గొప్ప అమెరికా అధ్యక్షుడిగా అనేకసార్లు అభివర్ణించారు. ఇటీవల ట్రంప్ తనపై విమర్శలు చేసినప్పటికీ వివేక్ మాత్రం సంయమనం కోల్పోలేదు. ట్రంప్‌నకు మద్దతుగానే ప్రతిస్పందించారు.
బిలియనీర్ వ్యాపారి
ఒహాయోలోని సిన్సినాటిలో భారతీయ దంపతులకు జన్మించిన వివేక్ రామస్వామి బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో రోయ్వాంట్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ సంస్థను నెలకొల్పిన ఆయన 2015, 2016 సంవత్సరాల్లో అతిపెద్ద బయోటెక్ ఐపీఓలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటితో పాటు మరిన్ని హెల్త్‌కేర్, టెక్నాలజీ కంపెనీలను నెలకొల్పారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
Vivek Ramaswamy On H1B Visa : నేను ప్రెసిడెంట్ అయితే.. H1B వీసాలు ఎత్తేస్తా : వివేక్ రామస్వామి
Trump Biden Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ X బైడెన్.. 10 పాయింట్ల తేడాతో ఆయనే ముందంజ!