Russia war a genocide: ఉక్రెయిన్‌లో రష్యా నరమేధానికి పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయినీయన్లనే ఆలోచనను పూర్తిగా తుడిచిపెట్టేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతవారం రష్యా చర్యలను యుద్ధ నేరాలుగా అభివర్ణించారు బైడెన్. ఇది నరమేధం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పుడు మాత్రం రష్యా చేస్తోందని మారణకాండేనని స్పష్టం చేశారు. 'అవును. ఇది కచ్చితంగా నరమేధమే. ఇది రోజురోజుకు మరింత స్పష్టమవుతోంది. ఉక్రెయిన్ అనే ఆలోచననే పుతిన్ తుడిచేయాలని భావిస్తున్నారు' అని బైడెన్ వ్యాఖ్యానించారు. రష్యా తీరు మారణకాండ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంపై అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయవాదులు నిర్ణయం తీసుకుంటారని బైడెన్ పేర్కొన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
Ukraine Russia war: మరోవైపు, బైడెన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్వాగతించారు. నిజమైన నాయకుడు నిజమైన వ్యాఖ్యలు చేశారంటూ ట్వీట్ చేశారు. అమెరికా అందిస్తున్న సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు తమకు మరింత ఆయుధ సాయం కావాలని విజ్ఞప్తి చేశారు.
US aid Ukraine: ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా మరింత సాయం చేసేందుకు సిద్ధమవుతోంది. 750 మిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఆయుధాలతో కూడిన హమ్వీ వాహనాలు, అధునాత పరికరాలను అమెరికా పంపనుందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. హావిట్జర్ కెనాన్, తీరప్రాంత డ్రోన్లు, రసాయన దాడులను తట్టుకోగలిగే సూట్లను అందించనున్నట్లు తెలిపింది. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్‌కు 1.7 బిలియన్ డాలర్ల సాయం అందించింది అమెరికా.
నిర్బంధం...: రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు, సుసంపన్నుడైన విక్టర్ మెద్వెద్‌చుక్‌ను తాము నిర్బంధించినట్లు ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. చేతులకు బేడీలు వేసి ఉన్న మెద్వెద్చుక్ ఫొటోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. తమ ప్రత్యేక బలగాలు ఆయన్ను నిర్బంధించినట్లు వివరించారు.
జపాన్ నుంచి ఉక్రెయిన్‌కు మహిళ: యుద్ధం నేపథ్యంలో పౌరులంతా విదేశాలకు తరలివెళ్తున్న వేళ.. జపాన్‌లో ఉండే మహిళ తన స్వస్థలాన్ని విడిచి ఉక్రెయిన్‌కు వెళ్లారు. తన తల్లిదండ్రులను కాపాడుకునేందుకు సాషా కవేరీనా అనే ఉక్రెయిన్ మహిళ ఖార్కీవ్‌కు చేరుకున్నారు. తల్లిదండ్రులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడమే తన ధ్యేయమని చెబుతున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా జపాన్‌లో పలు ర్యాలీలు నిర్వహించారు కవేరీనా. ఉక్రెయిన్‌కు సాయంగా వైద్య పరికరాలు, ఔషధాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న తన తల్లిదండ్రులను రష్యా దళాలు చంపేస్తాయనే భయంతో.. తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కవేరీనా తల్లిదండ్రులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై మార్చిలో భీకర దాడులు జరిగాయి. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లి సమీప పట్టణాల్లోని బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. రెండు రోజుల ప్రయాణం అనంతరం కవేరీనా తన తల్లిదండ్రులను కలుసుకున్నారు.
ఇదీ చదవండి: