Cluster Bomb Munitions : యుద్ధక్షేత్రంలో అత్యంత భారీ నష్టాన్ని కలగజేసే క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు అందించాలనే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ వెల్లడించారు. ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకునేందుకు తమకు సమయం పట్టిందన్న ఆయన.. ఈ విషయంలో మిత్రదేశాలతోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
Cluster Bombs Russia Ukraine : క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తమకు తెలుసని అందుకే వీలైనంత కాలం ఈ నిర్ణయాన్ని వాయిదా వేశామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సులీవన్ తెలిపారు. ఉక్రెయిన్ వద్ద ఆయుధ సామగ్రి అయిపోతోందని యుద్ధ సమయంలో ఆ దేశాన్ని నిస్సహాయ స్థితిలో వదిలేయలేమని చెప్పారు. అమెరికా నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమయోచిత చర్యగా పేర్కొనగా రష్యా మాత్రం ఖండించింది. అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా.. అమాయక పౌరుల ప్రాణాలకు ఏళ్ల తరబడి ముప్పు పొంచి ఉంటుందని రష్యా విమర్శించింది. ఈ యుద్ధంలో రష్యా ఇప్పటికే క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తోన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Cluster Bomb Attack Explosion : క్లస్టర్ బాంబులనేవి గాల్లో విచ్చుకొని.. ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒకే సమయంలో భిన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. ఫిరంగుల ద్వారా 24 నుంచి 32 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై వీటిని ప్రయోగించవచ్చు. మామూలు బాంబుల కంటే వీటి విధ్వంస ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్నచిన్న బాంబులుగా విచ్చుకుపోయి లక్ష్యాన్ని.. చేరే క్రమంలో పౌరనష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అంతేగాకుండా విచ్చుకున్న క్లస్టర్ బాంబు ముక్కల్లో కొన్ని అప్పటికప్పుడు పేలవు. కొద్దికాలం తర్వాత పేలే అవకాశం ఉంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటి ముప్పు చాలా కాలం ఉంటుంది. ఈ బాంబులతో పౌర సమాజానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని క్లస్టర్ బాంబుల దాడులతో చాలామంది మరణించే ప్రమాదం ఉందని.. మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధంలోనే కాదు యుద్ధానంతరం పేలేవాటితోనూ నష్టమేనని వాపోతున్నాయి.
Cluster Bomb Banned : సిరియా ప్రభుత్వం తమ వ్యతిరేకవర్గాలపై క్లస్టర్ బాంబులను. భారీగా ప్రయోగించింది. ఆఫ్ఘానిస్థాన్ యుద్ధంలో అమెరికా అదే పనిచేసింది. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దాదాపు 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వాటిలో కొన్ని ఇప్పటికీ పేలుతుండటం వల్ల లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే 2008లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 120కిపైగా దేశాలు ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధించాయి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.