అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో మరోసారి అధ్యక్షునిగా పోటీ చేసేందుకు గట్టిగా పావులు కదుపుతున్నారు. ఒకవేళ తనకు రిపబ్లికన్ల నుంచి తగినంత మద్దతు లభించనట్లయితే తృతీయపక్ష అభ్యర్థిగానైనా బరిలో దిగాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు 'ది కమింగ్ స్ప్లిట్' పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనొక వ్యాసం వెలువరించారు. ఫ్లోరిడా గవర్నర్‌గా ఉన్న రాన్ డి శాంటిస్ పలువురు రిపబ్లికన్ల నుంచి మద్దతు కూడగట్టి ఎన్నికల బరిలో ఒకరిగా ముందడుగు వేస్తుండడంతో ట్రంప్ ఈ దిశగా యోచిస్తున్నారు.
ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ సభలకు హాజరు బాగానే ఉన్నా, ఆయన బలపరిచిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. అయినా ఆయనకు రిపబ్లికన్ల అండ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఎక్కువగా ఫ్లోరిడాలోని నివాసానికే పరిమితం అవుతున్నారు. ఇంతవరకు ఒక్క ప్రచార కార్యక్రమాన్నీ నిర్వహించలేదు. దీంతో ఆయన నిజంగానే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయదలచుకున్నారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో కేసులపరంగా ట్రంప్ కొన్ని ఇబ్బందుల్లో ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.