Russia Ukraine War : ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధాన్ని ఆరంభించిన రష్యా.. మొదట్లో భీకరంగా విరుచుకుపడింది. కొన్నిచోట్ల ఆధిపత్యం చాటుకుంది. అప్పట్నుంచీ ఎడతెరిపి లేకుండా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, రోజులు గడుస్తున్నకొద్దీ పుతిన్ సేనలపై ఉక్రెయిన్ బలగాలు పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. రష్యా నుంచి పలు ప్రాంతాలను మళ్లీ చేజిక్కించుకుంటున్నాయి. మాస్కో మద్దతున్న తిరుగుబాటుదారుల ఆధిపత్యంలోని లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లోనూ ముందుకు వెళ్తున్నాయి. మాస్కో సేనలు యుద్ధంలో వెనుకబడ్డాయన్న కథనాలు పుతిన్‌పై సహజంగానే ఒత్తిడి పెంచుతున్నాయి.
ఉక్రెయిన్ తనకంటే ఎంతో బలమైన మాస్కోకు ఎదురు నిలవడంలో అమెరికా, పశ్చిమ దేశాల సైనిక సహకారం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. దొనెట్స్క్, లుహాన్స్క్‌లతో పాటు జపోరిజియా, ఖేర్సన్‌లు కూడా తమ భూభాగాలేనని పుతిన్ ప్రకటించారు. వాటి జోలికి వస్తే.. అణ్వస్త్ర ప్రయోగానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. తద్వారా ఆ నాలుగు ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకోవచ్చని, ఉక్రెయిన్ లేదా పశ్చిమ దేశాలు ఇక వాటిపై అంత సులభంగా దండెత్తలేవని ఆయన భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ నాలుగు ప్రాంతాలు బలప్రయోగంతో కాకుండా, ప్రజామోదంతోనే విలీనమైనట్టు అంతర్జాతీయ సమాజానికి చెప్పేందుకు.. ఆయా చోట్ల స్థానిక మద్దతుదారులతో రెఫరెండం నిర్వహించడం గమనార్హం. ఈ విలీన ప్రక్రియను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. ఐరాస లక్ష్యాలకూ, మూల సిద్ధాంతాలకూ విరుద్ధమని మండిపడ్డారు.
సరిహద్దుల మాటేంటి?
నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించిందే తప్ప, కొత్త సరిహద్దులు ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. ఈ విషయమై అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. మొత్తం డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాలో భాగంగా చూస్తామని మాత్రమే చెప్పారు. దొనెట్స్క్, లుహాన్స్క్‌ల మొత్తం భూభాగాన్ని కలిపినా డాన్‌బాస్‌లో 60% మాత్రమే ఉంటుంది. దీంతో మిగతా 40% భూభాగాన్ని కూడా రష్యా ఆక్రమిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తింది. విలీన ప్రకటనతో రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమవుతుందని, ఏమాత్రం అదుపు తప్పినా భారీ విధ్వంసం చోటుచేసుకుంటుందని యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రిఫరెండం చెల్లదన్న ఐరాస.. ఓటింగ్‌కు భారత్ మళ్లీ దూరం
ఆ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. పుతిన్ ప్రకటన.. నాటో దళాలకు నో ఎంట్రీ!