భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. నటి మేఘన్ మెర్కెల్‌తో పెళ్లి విషయంలో ఆయనకు కుటుంబంతో అభిప్రాయభేదాలు తలెత్తింది. అయితే, ఓ సారి ఆమె గురించి హ్యారీ, ఆయన అన్న ప్రిన్స్ విలియం మధ్య పెద్ద గొడవే జరిగి అది భౌతిక దాడికి దారితీసిందట. తన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం 'స్పేర్'లో హ్యరీ ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. జనవరి 10న 'స్పేర్' పుస్తకాన్ని హ్యారీ ఆవిష్కరించనున్నారు. ఈలోగా ఈ పుస్తకంలోని కొన్ని కీలక అంశాలతో 'ది గార్డియన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2019లో ఈ ఘటన జరిగినట్లు హ్యారీ తన పుస్తకంలో పేర్కొన్నారు.
మా అన్న నన్ను కొట్టాడు..
''లండన్‌లోని మా ఇంట్లో మేఘన్ గురించి నాకు, విలియంకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఆమె మొరటు మనిషి అని విలియం ఆరోపించారు. నాకు కోపం వచ్చింది. మీడియా చెప్పిందే గుడ్డిగా నమ్ముతున్నావా? అని అరిచాను. ఆ వాగ్వాదం కాస్తా తీవ్రంగా మారింది. విలియం నా కాలర్ పట్టుకుని లాగి.. నేలపైకి తోసేశారు. దీంతో నేను శునకానికి ఆహారం వేసే గిన్నెపై పడిపోయాను. ఆ గిన్నె విరిగి ఆ ముక్కలు నా వెన్నుకు గుచ్చుకున్నాయి. ఇదంతా క్షణాల్లో జరిగింది. కిందపడ్డ నన్ను కనీసం పైకి లేపలేదు.
నేను లేచి విలియంను వెళ్లిపొమ్మని అరిచాను. విలియం బయటకు వెళ్తూ.. 'ఇదంతా మేఘన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నారు. నేను కూడా వెంటనే ఈ విషయాలన్నీ మేఘన్‌కు చెప్పలేదు. కానీ, ఆ తర్వాత నా గాయాలను చూసి ఆమెకు ఏం జరిగిందో చెప్పమని బలవంతం చేసింది. అదంతా విని ఆమె ఆశ్చర్యపోలేదు కానీ చాలా బాధపడింది'' అని హ్యారీ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.
రాజీకి నేను సిద్ధమే.. కానీ వాళ్లే..
ఇలాంటి సంచలన విషయాలు ఆ పుస్తకంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల యూకే, అమెరికాలోని కొన్ని మీడియా ఛానళ్లకు హ్యారీ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవి కూడా ఈ పుస్తకం ఆవిష్కరణకు రెండు రోజుల ముందు ప్రసారం కానున్నాయి. అందులోనూ ఆయన పలు సంచలన విషయాలను పంచుకున్నారు. తనకో మంచి కుటుంబం కావాలని, సంస్థ కాదని హ్యారీ చెప్పారు. ''రాజీ పడేందుకు నేను సిద్ధమే. కానీ వారు(కుటుంబం) ముందుకు రావట్లేదు. నా తండ్రి, సోదరుడితో ఎప్పటిలాగే కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నా'' అని హ్యారీ ఆ ఇంటర్వ్యూల్లో తెలిపారు.
అమెరికా నటి అయిన మేఘన్ మెర్కెల్‌ను హ్యారీ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు నుంచే మేఘన్ విషయంలో రాజకుటుంబంలో విభేదాలున్నాయి. పెళ్లి తర్వాత ఇవి మరింత తీవ్రమవడం వల్ల 2020లో హ్యారీ-మేఘన్ దంపతులు రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడ్డారు. మేఘన్ విషయంలో కుటుంబం చూపిన వివక్ష కారణంగానే తాను కుటుంబానికి దూరమయ్యానని హ్యారీ అనేకసార్లు బహిరంగంగానే వెల్లడించారు. గతేడాది తన నానమ్మ ఎలిజబెత్ 2 మరణించడంతో లండన్ వచ్చిన హ్యారీ దంపతులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.