Florida plane news: అమెరికా ఫ్లోరిడాలో హాలీవుడ్ సినిమాను తలపించే ఘటన జరిగింది. విమానం నడుపుతూ పైలట్ ఒక్కసారిగా కుప్పకూలగా... అందులోని ప్యాసెంజరే పైలట్‌గా మారి విమానాన్ని నడిపాడు. చివరకు దాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రయాణికుడి సమయస్ఫూర్తిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది కొనియాడారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
Passenger lands plane: ఫ్లోరిడా నుంచి చిన్న సైజు విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఫైలట్ తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీన్ని గమనించిన ప్రయాణికుడు కాక్‌పిట్‌లోని రేడియోను ఉపయోగించి సాయం కోసం అర్థించాడు. పైలట్ స్పృహ తప్పి పడిపోయాడని, తన పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని తెలిపాడు. తనకు విమానం నడపడం అసలు తెలియదని పేర్కొన్నాడు.
ప్రయాణికుడి సందేశం విని ఫోర్ట్ పీర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించాడు. సింగిల్ ఇంజిన్ సెస్నా 280 పొజిషన్ గురించి తెలుసా? అని ప్యాసెంజర్‌ను అడిగారు. అందుకు అతను బదులిస్తూ.. తనకు ఏమీ తెలియదని, తన ముందు ఫ్లోరిడా తీరమే కన్పిస్తుందని భయాందోళనతో చెప్పాడు. అనంతరం విమానాన్ని ప్యాసెంజర్ సీటు నుంచే నడిపేలా కంట్రోల్స్‌ను ఎనేబుల్ చేశారు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది. ప్రయాణికుడ్ని శాంతింపజేసి వింగ్స్ లెవెల్ మెయింటెన్ చేయమని సూచించారు.
Passenger turned pilot: ఆ తర్వాత కొద్ది నిమిషాలకు విమానం సరిగ్గా ఎక్కడుందో గుర్తించారు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది. అది బోకా రేటన్ నుంచి ఫ్లోరిడా ఉత్తర తీరం వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. అయితే ప్రయాణికుడి మాటలు అప్పుడు సరిగ్గా వినిపించలేదు. దీంతో స్పష్టంగా మాట్లాడేందుకు అతని ఫోన్ నంబర్ అడిగి.. పాల్మ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో కమ్యూనికేట్ చేయించారు. అక్కడ 20 ఏళ్ల సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్ పరిస్థితిని తన అదుపులోకి తీసుకున్నాడు. ప్రయాణికుడితో స్పష్టంగా మాట్లాడుతూ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయించాడు. అనంతరం సహాయక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పైలట్‌ను, ప్రయాణికుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమానంలో పైలట్‌తో పాటు ఒక్క ప్రయాణికుడే ఉన్నాడని అధికారులు వెల్లడించారు.
Passenger pilot: విపత్కర పరిస్థితిలోనూ ప్రయాణికుడు విమానాన్ని అద్బుతంగా నడిపాడని రాబర్ట్ మోర్గాన్ కొనియాడాడు. పవర్ తగ్గిస్తూ విమానాన్ని రన్‌వేపై స్మూత్‌గా ఎలా ల్యాండ్ చేయాలో ప్రయాణికుడికి చెప్పానని వివరించాడు. తాను సరైన సమయంలో సరైన చోట ఉన్నట్లు పేర్కొన్నాడు. ఒకరికి సాయం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. పైలట్ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇదీ చదవండి: పాపం ట్రంప్.. వ్యాపారం సాగక లగ్జరీ హోటల్ విక్రయం