తమ దేశం పేరుపై టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు.. నూతన నామాన్ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించారు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావుసోగ్లు. ఇది వరకు 'టర్కీ (turkey)'గా ఉన్న దేశం పేరును 'టుర్కీయే(Türkiye)'గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్కు ప్రతిపాదన బుధవారం రాత్రి అందినట్లు టర్కీ మీడియా 'అనదోలు ఏజెన్సీ' వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయం.. దేశాన్ని సరికొత్త బ్రాండ్‌గా తీర్చదిద్దడానికి.. కొన్ని అవరోధాలకు కారణమైన పక్షి (టర్కీ) పేరును దేశం పేరులో లేకుండా చేయడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లేఖ అందుకున్న క్షణం నుంచే.. టర్కీ దేశం పేరు మారినట్లుగా స్టెఫాన్ డుజారిక్ చెప్పినట్లు 'అనదోలు ఏజెన్సీ' తెలిపింది.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సైతం తమ దేశం పేరును టుర్కీయే (tur-key-YAY)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. 1923లో స్వాతంత్ర్య వచ్చిన అనంతరం ఈ దేశం తనను తాను 'టుర్కీయే'గా ప్రకటించుకున్నట్లు గుర్తు చేశారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని టర్కిష్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు.. ప్రియుడి కోసం యువతి సాహసం!