బస్సు టైరు పంక్చర్ కావడం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది గాయపడ్డారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్లో కఫ్రీన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం వేకువజామున మూడున్నర గంటలకు జరిగిందీ దుర్ఘటన. ఆ దేశాధ్యక్షుడు మాక్కీ సాల్ ట్విట్టర్లో ఈ విషయం ప్రకటించారు.
సెనగల్లోని ఒకటో నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు టైరు పంక్చర్ కావడం వల్ల.. అదుపు తప్పి, రోడ్డుకు అవతలివైపునకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నివీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. 78 మంది గాయాలపాలవ్వడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సోమవారం నుంచి మూడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు పాటించాలి. రోడ్డు భద్రతా చర్యలపై అధికారులతో చర్చిస్తా.
--మాక్కీ సాల్, సెనగల్ అధ్యక్షుడు
అధ్వానంగా ఉన్న రోడ్లు, వాహన డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు 2017లో రెండు బస్సులు పరస్పరం ఢీకొట్టడం వల్ల 25 మంది ప్రాణాలు కోల్పోయారు.