Japan shooting incidents: ప్రశాంతతకు మారుపేరైన జపాన్‌లో మాజీ ప్రధాన మంత్రి షింజో అబెను హత్య చేయడం ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకునే అమెరికాకు భిన్నంగా ఇక్కడ తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. అయినా అత్యున్నత స్థాయి భద్రత కలిగి ఉన్న షింజోను ఒక వ్యక్తి కాల్చి చంపడం అనూహ్యం.
జపాన్‌లో తుపాకీ సంస్కృతి చాలా తక్కువ. వాటి వినియోగాన్ని నియంత్రించేందుకు అక్కడ కఠిన చట్టాలు ఉన్నాయి. 12.5 కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో.. తుపాకుల సంబంధిత నేరాలు గత ఏడాది 10 మాత్రమే చోటుచేసుకున్నాయంటే నిబంధనలు ఎంత పటిష్ఠంగా అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇదే తీరు. నాటి పోరులో జపాన్‌కు అమెరికా అనేక షరతులు విధించింది. పౌరుల వద్ద కూడా తుపాకులు ఉండరాదన్న నిబంధన కూడా ఇందులో ఉంది.
13 అంచెలు దాటాలి..
పోలీసులు, సైన్యం మినహా జపాన్‌లో ఎవరూ ప్రమాదకర ఆయుధాలను కలిగి ఉండకూడదు. పౌరులకు హ్యాండ్ గన్ లేదా రైఫిల్‌ను విక్రయించరు. ఎయిర్‌గన్స్ కలిగి ఉండటానికి మాత్రమే వారు అర్హులు. అదీ.. నిర్దిష్ట అవసరాలకే వాటిని అనుమతిస్తారు.
- జపాన్‌లో తుపాకీ లైసెన్సు పొందాలంటే ఒక వ్యక్తి.. రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తుదారుడి మానసిక ఆరోగ్యాన్నీ పరిశీలిస్తారు. నేపథ్యాన్నీ క్షుణ్నంగా ఆరాతీస్తారు. ఇందులో భాగంగా అధికారులు.. దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను ప్రశ్నిస్తారు. షూటింగ్ పరీక్షలో 95 శాతం కచ్చితత్వాన్ని కూడా దరఖాస్తుదారుడు సాధించాలి.
- మొత్తంమీద 13 అంచెల్లో పరిశీలనలు సాగుతాయి. వాటన్నింటినీ అధిగమిస్తేనే జపాన్‌లో తుపాకీ లైసెన్సు పొందడం సాధ్యమవుతుంది. అది కూడా మూడేళ్లపాటే చెల్లుబాటు అవుతుంది. తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో తుపాకీ లైసెన్సు పొందడానికి అత్యధిక సంఖ్యలో అనుమతులు అవసరమైన దేశంగా జపాన్ గుర్తింపు పొందింది.
- లైసెన్సుదారుడు తుపాకీని భద్రంగా ఉంచడానికి అవసరమైన లాకింగ్ వ్యవస్థను కొనుగోలు చేయాలి. వేటాడటానికి ప్రత్యేక లైసెన్సు అవసరం. లైసెన్స్‌దారుడు చనిపోయిన వెంటనే అతడి బంధువులు ఆ ఆయుధాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి.
పోలీసులూ అరుదుగానే..
జపాన్ పోలీసుల వద్ద తుపాకులు ఉంటాయి. ప్రధాన విశ్వవిద్యాలయాల్లో రైఫిల్ క్లబ్‌లు ఉంటాయి. అయినా ఈ దేశంలో అనేకమంది తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా గన్ చూడరని విశ్లేషకులు చెబుతున్నారు. పోలీసులు కూడా కాల్పులకు దిగే సందర్భాలు చాలా అరుదు. డ్యూటీలో లేకుంటే వారి వద్ద కూడా తుపాకులు ఉండకూడదు.
- ప్రత్యేక లైసెన్సు లేకుండా కొన్ని రకాల కత్తులు, ఆయుధాలు కలిగి ఉండటమూ జపాన్‌లో నిషిద్ధమే.
- జపాన్‌లో ప్రాణహాని కలిగే నేరాల్లో కత్తిపోట్ల ఘటనలే అధికం. టోక్యోలో చివరిసారిగా కాల్పుల ఘటన జరిగింది 2019లో. నాడు ఒక ముఠా సభ్యుడిని కాల్చి చంపారు.
సొంత తయారీ..
షింజో హత్యకు ఉపయోగించిన తుపాకీని హంతకుడే సొంతంగా తయారుచేసుకొని ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిలో తూటాలోకి విడిగా గన్‌పౌడర్‌ను కూరుస్తారని చెబుతున్నారు. ఇలాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చట్టాలను మరింత కఠినంగా తయారుచేయాలని సూచిస్తున్నారు.
జపాన్‌లో గతంలోనూ ప్రముఖులపై కాల్పులు
మాజీ ప్రధానమంత్రి షింజో అబె హత్యతో జపాన్ ఉలిక్కిపడింది. అయితే ఆ దేశంలో ప్రముఖులపై కాల్పులు జరగడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇవీ..
- 1990లో అప్పటి నాగసాకి నగర మేయర్ మోతోషిమా హితోషిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో హితోషి తీవ్రంగా గాయపడ్డారు.
- 1992లో అప్పటి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షుడు కనమెరు షిన్ లక్ష్యంగా తొచిగి ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ షిన్ గాయాలపాలు కూడా కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
- 1994లో మాజీ ప్రధాని హొసొకవా మొరిహిరోను లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే మొరిహిరో తూటాల నుంచి తప్పించుకున్నారు.
- 1995లో టోక్యోలో అప్పటి నేషనల్ పోలీస్ ఏజెన్సీ కమిషనర్ జనరల్ కునిమత్సు తకజిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. తకజి తీవ్రంగా గాయపడ్డారు.
- 2007లో అప్పటి నాగసాకి మేయర్ ఇతో ఇతోచిని ఓ ముఠా కాల్చిచంపింది.
కాల్పుల వీడియోల తొలగింపు
షింజో అబెపై కాల్పులు జరిగిన వెంటనే.. సంబంధిత వీడియోలు ట్విటర్, ఫేస్‌బుక్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే- ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నట్లు ట్విటర్, ఫేస్‌బుక్ శుక్రవారం ప్రకటించాయి. హింసాత్మక వీడియోలు వైరల్ అవ్వడాన్ని తాము ప్రోత్సహించబోమని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: