Japan Fish Dead In Beach : ఉత్తర జపాన్‌లోని సముద్రం తీరానికి వేలాదిగా మృతిచెందిన చేపలు కొట్టుకువచ్చాయి. ఒక కిలోమీటరు వరకు సముద్రం ఒడ్డున ఈ మృతిచెందిన చేపలే ఉన్నాయి.ఇలా వేలాదిగా చేపలు మృత్యువాతపడటానికి స్పష్టమైన కారణం తెలియరావడం లేదు. హక్కైడో ప్రిఫెక్చర్‌లోని హకోడేట్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెద్ద చేపల వెంటాడటం వల్ల ఇలా చేపలు మరణించి ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదా శీతల జలాల్లోకి పెద్ద సంఖ్యలో చేపలు ప్రవేశించినా ఇలా వేల సంఖ్యలో మృత్యువాత పడుతుంటాయని తెలిపారు. చేపల మృతికి స్పష్టమైన కారణం తెలియకపోవడం వల్ల ఇలాంటి చేపలు తినడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారులు సముద్రం ఒడ్డుకు చేరుకుని మృతిచెందిన చేపలను సేకరిస్తున్నారు.
"ఇలాంటి పరిణామాల గురించి గతంలో విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి. భారీ చేప వీటిని తరిమి ఉండొచ్చు. దాన్నుంచి తప్పించుకునేందుకు చాలాసేపు ఈదడం వల్ల చేపలు అలసిపోయి ఉంటాయి. అన్నీ ఒకే చోటికి చేరుకోవడం వల్ల ఆక్సిజన్ కొరత తలెత్తి అవి చనిపోయి ఉండవచ్చు. కుళ్లిపోయిన చేపలు జలాల్లో ఆక్సిజన్‌ను మరింత తగ్గేలా చేస్తాయి. చేపలు ఎందువల్ల చనిపోయాయో స్పష్టంగా తెలియదు కాబట్టి వాటిని తినొద్దని కోరుతున్నా."
-టకాషి ఫుజియోకా, హకోడాటె ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు
ఆస్ట్రేలియా తీరానికి పైలట్ తిమింగలాలు
ఇటీవల ఆస్ట్రేలియాలో ఇదే తరహా ఘటన ఒకటి సంభవించింది. సముద్ర తీరానికి భారీ సంఖ్యలో అరుదైన తిమింగలాలు కొట్టుకొచ్చాయి. పదుల సంఖ్యలో తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి. అనేక తిమింగలాలు అక్కడి ఇసుక తిన్నెల్లో చిక్కుకుపోయాయి. వాటిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నించారు. పైలట్ తిమింగలాలుగా పిలిచే ఈ అరుదైన జీవులు మూడేళ్లకోసారి మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి. ఈ తిమింగలాల ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
న్యూజిలాండ్‌లో 477 పైలట్ తిమింగలాలు మృతి
అంతకుముందు, న్యూజిలాండ్‌లో 477 పైలట్ తిమింగలాలు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చి ప్రాణాలు కోల్పోయాయి. బీచ్‌లోని ఇసుకలో కూరుకుపోయి చనిపోయాయి. వందల సంఖ్యలో పైలట్ తిమింగలాలు చనిపోవడంపై పర్యావరణవేత్తల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఆ బీచ్‌లో పందులే ప్రత్యేక ఆకర్షణ
బీచ్‌కు కొట్టుకొచ్చిన పైలట్ వేల్స్.. 50కి పైగా మృతి.. స్థానికులకు షార్క్‌ల భయం!