Japan earthquake today : జపాన్ను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని.. మరో 13 మంది గాయపడ్డారని అధికారుల తెలిపారు. ఆరు ఇళ్లు నష్టానికి గురయ్యాయని వారు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో మరింత నష్టం జరిగొచ్చన అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం ఉందని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి హిరోకాజు మట్సునో తెలిపారు. అయితే వాటికి ఇప్పుడే దృవీకరించలేమని వెల్లడించారు.
నిలబడడానికి, సోఫాలపై కూర్చోవడానికి కూడా వీలులేనంతగా ప్రకంపనలు వచ్చాయని సమాచారం. ఘటన సమయంలో చాలా సేపు భూమి కంపించినట్లు, రూమ్‌లోని గోడకున్న ఫ్రేమ్‌లు దాదాపు 30 సెకన్లు పాటు కదిలిన శబ్ధం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పెద్ద పెద్ద భవనాలు కాసేపు కదిలాయని వారు పేర్కొన్నారు. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని టోక్యో నుంచి కనజావాలను నిడిచే బుల్లెట్ రైళ్లను తాత్కాలికంగా ఆపేసినట్లు అధికారులు తెలిపారు. వాటిని భద్రత పరంగా పరిశీలించిన అనంతరం తిరిగి పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
జపాన్ సముద్రం ఒడ్డున ఇషికావా ప్రిఫెక్చర్లో మధ్యాహ్నం 2.42 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రధాన కేంద్రం హోన్షు ద్వీపానికి సమీపంలో ఉందని వెల్లడించారు. దాదాపు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వారు వివరించారు. జపాన్ వాతావరణ సంస్థ భూకంపం తీవ్రతను మొదట 6.3గా పేర్కొన్నప్పటికీ.. తరువాత దానిని 6.5గా నిర్ధరించింది. భూకంపం నేపథ్యంలో జపాన్ విపత్తు నిర్వహణ సంస్థ వెంటనే అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టింది.
Earthquake Japan today : ఒక వ్యక్తి నిచ్చెనపై నుంచి కిందపడి, మరొకరు అల్మారా కూలి పడి గాయపడ్డారని జపాన్ విపత్త నిర్వహణ సంస్థ వివరించింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో రెండు ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని.. వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని జపాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి సునామీ వచ్చే ప్రమాదం కూడా ఏం లేదని వారు పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటిగా ఉంది. ఇక్కడ స్వల్ప, అధిక మోతాదులో ప్రతి సంవత్సరం దాదాపు 5వేల భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ ప్రజలు వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీంతో భూకంపం వచ్చినప్పుడు.. ఇతర దేశాల్లో జరిగే నష్టంతో పోలిస్తే జపాన్‌లో మరణాలు, ఆస్తి నష్టం చాలా తక్కువగా జరుగుతాయి. 2011లో జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం, సునామీతో.. ఈ దేశం తీవ్ర నష్టాన్ని చవిచూసింది.
జపాన్‌లోనే ఎందుకు?
why earthquake happens in japan : జపాన్ భౌగోళిక పరిస్థితుల రీత్యా ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. నలభైవేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో.. 450 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో అధిక మొత్తం అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ నాలుగు కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. దీంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో పాటు జపాన్ ట్రెంచ్‌గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం ఎనిమిది వందల మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు జరిగినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.