భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్.. అమెరికాలో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో తొలి సిక్కు మహిళా జడ్జిగా ఆమె ఘనత సాధించారు. టెక్సాస్ రాష్ట్రం.. హ్యూస్టన్ నగరంలో ఉన్న హారిస్ కౌంటీ సివిల్ కోర్టులోని 'లా నెంబర్ 4'లో ఆమె జడ్జిగా నియమితులయ్యారు. శుక్రవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హ్యూస్టన్‌కు ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప అనుభూతి అని మోనిక సంతోషం వ్యక్తం చేశారు.
ప్రమాణస్వీకారానికి నేతృత్వం వహించిన వ్యక్తి సైతం భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం. భారతీయ-అమెరికన్ న్యాయమూర్తి రవి సంధిల్ నేతృత్వంలో మోనిక ప్రమాణస్వీకారం జరిగింది. "ఇది సిక్కు కమ్యూనిటీకి చాలా గొప్ప సందర్భం. శ్వేతజాతీయేతర వ్యక్తులను చూస్తే కొంత భిన్నంగా కనిపిస్తారు. వారు మనకు అండగా ఉంటారనే భావన కలుగుతుంది. మన్‌ప్రీత్ మోనిక సిక్కుల ప్రతినిధి మాత్రమే కాదు.. శ్వేతజాతీయేతర మహిళలకు సైతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు" అని సంధిల్ పేర్కొన్నారు.
లాయర్‌గా 20ఏళ్ల సేవలు..
మోనిక తండ్రి 1970లలో అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో జన్మించిన మోనిక.. ప్రస్తుతం బెలైర్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు సంతానం. లాయర్‌గా 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. అనేక పౌర హక్కుల సంస్థలలో భాగస్వామిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు.
అమెరికాలో సుమారు 5లక్షల మంది సిక్కులు ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ ప్రాంతంలోనే సుమారు 20వేల మంది సిక్కులు నివసిస్తున్నారు. మోనిక జడ్జిగా నియమితులు కావడం హ్యూస్టన్‌లో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శమని నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్నారు. శ్వేతజాతీయేతర వర్గాలతో పాటు, సిక్కు కమ్యూనిటికీ ఇది గర్వకారణమని అన్నారు.