Elon Musk China population collapse: చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందని నివేదికలు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. చైనా జనాభాపై మరోసారి స్పందించారు. అతి తొందరలోనే చైనా ‘జనాభా పతనాన్ని’ చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని తాజాగా వచ్చిన వార్తలపై స్పందించిన మస్క్.. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు.
చైనాలో గతేడాది జననాల రేటు భారీగా తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. 2021లో చైనా జనాభా 141కోట్ల 26 లక్షలుగా ఉంది. అంతకుముందు ఏడాది (141 కోట్ల 21లక్షల)తో పోలిస్తే కేవలం 4,80,000 జనాభా మాత్రమే పెరిగింది. అంతేకాకుండా 1980 దశకంలో చైనా జనాభా పెరుగుదల రేటు 2.6శాతంగా ఉండగా.. 2021నాటికి 1.5 శాతానికి తగ్గిపోయిందని తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ‘చైనాలో ఒకే సంతానం విధానం అమలులో ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం అక్కడ ముగ్గురు సంతానం కలిగే విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ గతేడాది జననాల రేటు అత్యంత కనిష్ఠంగా నమోదైంది. ప్రస్తుత జననాల రేటు ప్రకారం చూస్తే.. ప్రతి తరంలో 40 శాతం మందిని చైనా కోల్పోతుంది. ఇదే జనాభా పతనం’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా.. గతకొన్ని దశాబ్దాలు ఒకే సంతానం విధానాన్ని కొనసాగించింది. దీంతో జననాల రేటు భారీ స్థాయిలో పడిపోతోందని గుర్తించిన డ్రాగన్ దేశం.. 2016లో ఆ విధానానికి స్వస్తి పలికింది. అప్పటి నుంచి ముగ్గురు సంతానం కలిగి ఉండవచ్చని ప్రకటించడంతోపాటు ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా మొదలుపెట్టింది. అయినప్పటికీ గతేడాది భారీ స్థాయిలో జననాల రేటు తగ్గడంతో చైనాలో ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: