Britain Queen Funeral : లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో రాణి ఎలిజబెత్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచడం వల్ల ప్రజలు అక్కడికి భారీగా తరలివెళ్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా సహా కామన్వెల్త్ దేశాల ప్రజలు.. క్వీన్ ఎలిజబెత్‌ను కడసారి చూసేందుకు ఎంత సమయమైనా.. లైన్లలో నిలుచోటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గంటల తరబడి నిల్చోవడం తాము రాణికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నామని.. ఈ గౌరవం ఇవ్వటానికి ఆమె అర్హురాలని వెల్లడించారు. రాణి పట్ల తమకు గల అంతులేని ప్రేమే తమను అలా వేచిచూసేలా చేస్తోందని బ్రిటీషర్లు అన్నారు. సుదీర్ఘపాలనలో రాణి తమను ఎంతగా ప్రేమించేదో వారు వివరించారు. క్యూలైన్లలో కొన్ని గంటలపాటు వేచి ఉండటం తమకు ఏ మాత్రం బాధ, అసంతృప్తి కలిగించడం లేదని చెబుతూ కన్నీరు పెడుతున్నారు.
రాణికి తుది వీడ్కోలు పలకడానికి వచ్చిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగర వీధుల్లో 500 వరకు ప్రజా టాయిలెట్లను ఏర్పాటు చేసింది. ప్రజలకు అసౌకర్యం కలగకూడదని పొద్దూ మాపూ తేడా లేకుండా అక్కడి దుకాణాలు, రెస్టారెంట్లను దుకాణ యజమానులు స్వచ్ఛందంగా తెరిచి ఉంచుతున్నారు. వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీల్ చైర్లను ఏర్పాటు చేసి రాణి పార్థివ దేహం వద్దకు తీసుకువెళుతున్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్2 అంత్యక్రియల నేపథ్యంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగే రాణి అంత్యక్రియలకు శబ్ద కాలుష్యం లేకుండా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో 100 విమానాలను కొన్ని గంటలపాటు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకల షెడ్యూల్‌లో 15 శాతం మేర మార్పులు జరుగుతాయని బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. రాణి పార్థీవదేహం ఊరేగింపు నేపథ్యంలో మధ్యాహ్నం 35 నిమిషాల పాటు విమాన సర్వీసులు కొనసాగవని తెలిపింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో మరికొంత సమయం పాటు విమాన సర్వీసులు ఉండవని వెల్లడించింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలను బుక్‌చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ సేవలను ఎంచుకోవాలని తెలిపింది. టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగిస్తామని పేర్కొంది.
ఇవీ చదవండి: '70 వేల స్టార్టప్‌లు, 100 యూనికార్న్‌లు.. త్వరలోనే తయారీ కేంద్రంగా భారత్!'
భర్త సమాధి వద్దే ఎలిజబెత్-2 ఖననం.. రాణి నివాళికి వేలాది మంది బ్రిటన్ పౌరులు