పాక్ మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. పాక్‌లో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌తో ఇమ్రాన్ చేస్తున్న లాంగ్‌మార్చ్‌లో ఇమ్రానే లక్ష్యంగా దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ కాలులో బుల్లెట్ దిగింది. హుటాహుటిన ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల సమయంలో ఇమ్రాన్ పక్కనే ఉన్న కొందరు గాయపడ్డారు. కాల్పుల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీటీఐ నేతలు డిమాండ్ చేయగా... పాక్ ప్రధాని కాల్పుల ఘటనను ఖండించారు.
పాక్‌లో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌తో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఇమ్రాన్ లాంగ్‌మార్చ్ చేస్తున్నారు. ఈ లాంగ్ మార్చ్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని అల్లాహో చౌక్ దగ్గరకు చేరుకోగానే దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్ కంటెయినర్ పైకి ఎక్కి నిలబడిన సమయంలో కాల్పులు జరిపినట్లు పీటీఐ వెల్లడించింది. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడుతుండడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనంతరం ప్రజలు, పీటీఐ కార్యకర్తలు భయంతో అటూఇటూ పరుగులు తీశారు. కొద్దిసేపటికే కాల్పుల్లో ఇమ్రాన్ గాయపడ్డట్లు తెలిసింది.
ఇమ్రాన్‌ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్ నుంచి ఇమ్రాన్‌ను కారులోకి తరలిస్తుండగా ఆయన కుడి కాలికి బ్యాండేజీ ఉన్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఘటన తర్వాత ఇమ్రాన్ ఖాన్ కంటెయినర్ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసిన వీడియోను పీటీఐ పార్టీ షేర్ చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యా యత్నం జరిగిందని ప్రకటించిన పీటీఐ... మరికొందరు నేతలు కూడా గాయపడ్డట్లు తెలిపింది. ఇమ్రాన్ కంటెయినర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు... రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని పీటీఐ నేత ఫవాద్ చౌధురి హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్‌పై దాడి చేయడం అంటే పాకిస్థాన్‌పై దాడి చేయడమేనని తెలిపారు.
ఇమ్రాన్‌పై కాల్పుల ఘటనపై పంజాబ్ ప్రావెన్స్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి స్పందించారు. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఇమ్రాన్‌పై కాల్పుల ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పంజాబ్ చీఫ్ సెక్రటరీ, ఐజీపీ నుంచి తక్షణమే నివేదిక కోరాలని పాక్ మంత్రి రాణా సనావుల్లాను పాక్ పీఎం ఆదేశించారు. ఇమ్రాన్‌ఖాన్ సహా గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.