అగ్రరాజ్యం అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో రెండు ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో హెలికాప్టర్లలో ఉన్న 9 మంది సైనికులు మృతి చెందారు. సైనికులకు శిక్షణ ఇస్తున్న సమయంలో కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్ వద్ద ఈ ఘటన జరిగిందని సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
నైరుతి కెంటకీలోని ట్రిగ్ కౌంటీలో బుధవారం రాత్రి సాధారణ శిక్షణా మిషన్‌లో భాగంగా ట్రైనింగ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగిందని ఫోర్ట్ క్యాంప్‌బెల్ ప్రతినిధి నోండిస్ థుర్మాన్ తెలిపారు. 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లోని రెండు HH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయాయని ఫోర్ట్ క్యాంప్‌బెల్ వెల్లడించింది. ఫోర్ట్ క్యాంప్‌బెల్‌కు వాయువ్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు అధికారులు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గురైన హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ ఆదేశాలతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన సైనికుల కుటుంబాల కోసం ప్రార్థించాలని గవర్నర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా కెంటకీ సెనేట్ సభ్యులు గురువారం ఉదయం కొద్దిసేపు మౌనం పాటించారు. గత నెలలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో టేనస్సీ నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు.
యూనివర్సిటీ బస్- పాసింజర్ వెహికల్ ఢీ.. 14 మంది దుర్మరణం
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ బస్సు.. ప్రయాణికుల వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో సహా 14 మంది మృతి చెందారు. 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో 30 మంది ఉన్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని నైరోబీ నుంచి నకూరు పట్టణం వైపు వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి కాలువలోకి బోల్తా పడిందని వెల్లడించారు.