nancy pelosi: యావత్ ప్రపంచానికి ఉత్కంఠ రేపిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ నిన్న రాత్రి ఆ దేశ రాజధాని తైపేలో అడుగుపెట్టిన పెలోసీ.. ఈ ఉదయం తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. సాయంత్రం తైపీ నుంచి దక్షిణకొరియా బయల్దేరారు.
తైవాన్ అధ్యక్షురాలితో భేటీ అనంతరం పెలోసీ విలేకరులతో మాట్లాడారు. తైవాన్‌ను తాము ఒంటరిగా వదిలేయబోమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి అమెరికా మద్దతు అత్యంత కీలకమని అన్నారు. దాన్ని స్పష్టంగా చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. తైవాన్‌లో స్వయంపరిపాలనకు తాము సంఘీభావంగా ఉంటామని స్పష్టం చేశారు.
చైనాను కించపరిస్తే..: మరోవైపు పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆమె తైపేలో అడుగుపెట్టిన వెంటనే డ్రాగన్ లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్‌ను ప్రారంభించింది. తైవాన్‌కు సమీపంలో భారీగా ఆయుధాలను మోహరించింది. పెలోసీ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యం ముసుగులో చైనా సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘిస్తోంది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఇదంతా కేవలం ఓ డ్రామా. నిప్పుతో చెలగాటమాడాలనుకునేవారు.. ఆ మంటల్లోనే కాలిపోతారు. చైనాను అవమానించాలని చూసేవారిని తప్పకుండా శిక్షిస్తాం’’ అని వాంగ్ హెచ్చరించారు.
పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌పై చైనా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతిని నిషేధించింది. వాటిల్లో అధిక పురుగు మందులు ఉన్నాయని ఆరోపించింది. ఇక శీతలీకరించిన చేపల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. దీంతోపాటు తైవాన్‌కు చైనా నుంచి ఎగుమతయ్యే ఇసుకపై కూడా నిషేధం విధించింది.
ఇవీ చదవండి: పెలోసీ పర్యటనతో తైవాన్ దిగ్బంధనం.. యుద్ధానికి చైనా సై.. ఏ క్షణమైనా!
బ్రిటన్ ప్రధాని ఎన్నిక ఆలస్యం.. గెలుపు తనదేనంటోన్న సునాక్!