భూతాప నియంత్రణ లక్ష్యాలను సజీవంగా ఉంచేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని (COP26 news) 200 దేశాలు ఆమోదించాయి. గ్లాస్కో వేదికగా జరుగుతున్న కాప్26 (COP26 2021) వాతావరణ సదస్సులో (COP26 Glasgow) ఈ మేరకు అంగీకారం తెలిపాయి. రెండు వారాల పాటు సమావేశాలు జరగ్గా.. చివరి రోజైన శనివారం మూడు గంటల పాటు చర్చలు జరిపాయి వివిధ దేశాలు. అయితే, బొగ్గు వాడకాన్ని 'దశలవారిగా నిలిపివేయడం' (COP26 coal phase out) నుంచి 'దశలవారిగా తగ్గించడం'గా మార్చాలని చివరి నిమిషంలో భారత్ (COP26 India) చేసిన ప్రతిపాదనపై మాత్రం అనేక దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
అనుకున్న లక్ష్యాలను (cop26 targets) ఒప్పందం సాధించలేదని పలు దేశాలు అభిప్రాయపడగా.. వాతావరణ మార్పుల నియంత్రణ అంశంలో ఈ ఒప్పందంతో కొంత పురోగతి సాధించినట్లు మరికొన్ని దేశాలు పేర్కొన్నాయి. అయితే, విజయం మాత్రం వరించలేదని తెలిపాయి.
భారత్‌ను వేలెత్తి చూపి...!
పలు దేశాలతో పాటు పర్యావరణ ఉద్యమకారులు.. బొగ్గు వినియోగంపై భారత్ (COP26 india commitment) చేసిన ప్రతిపాదనను తప్పుపడుతున్నారు. తుది ఒప్పందాన్ని బలహీనపర్చేలా భారత్ డిమాండ్లు చేసిందని విమర్శిస్తున్నారు.
"చివరి నిమిషంలో భారత్ చేసిన ప్రతిపాదన ఆశ్చర్యకరం. పర్యావరణ మార్పులపై కార్యాచరణను భారత్ ఎప్పటి నుంచో అడ్డుకుంటోంది. కానీ ఇంత బహిరంగంగా చేయడం మాత్రం నేను తొలిసారి చూస్తున్నా."
-బిల్ హరే, పర్యావరణ శాస్త్రవేత్త, క్లైమెట్ యాక్షన్ ట్రాకర్
బొగ్గుకు సంబంధించి పదాలను మార్చడం నిబంధనలకు వ్యతిరేకమని స్విట్జర్లాండ్, మెక్సికో వ్యాఖ్యానించాయి. చివరి నిమిషంలో వీటిని ప్రతిపాదించడం వల్ల.. ఒప్పందాన్ని ఆమోదించడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం ఇకపై మరింత కఠినతరమవుతుందని స్విట్జర్లాండ్ పర్యావరణ మంత్రి సిమోనెట్టా సొమ్మరుగా పేర్కొన్నారు.
బొగ్గు వాడుకునే హక్కు ఉంది: భారత్
ఈ సందర్భంగా జరిగిన చర్చలో భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమంగా బొగ్గు వాడకాన్ని నిలిపివేయాలన్న నిబంధనకు వ్యతిరేకంగా వాదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు శిలాజ ఇంధనాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఉందని చెప్పారు. అనేక కీలక విషయాలపై ఏకాభిప్రాయం లేదని అన్నారు. ధనిక దేశాల్లో ప్రజల జీవన విధానాలు, వినియోగ పద్ధతుల వల్ల భూతాపం పెరుగుతోందని పేర్కొన్నారు.
ఒప్పందం మంచిదే
ఇక, మరికొన్ని దేశాలు ఒప్పందాన్ని సానుకూల దృక్ఫథంతో స్వాగతించాయి. బొగ్గుపై వినియోగించిన భాషను మార్చడం సహా.. పేద దేశాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఒప్పందంలో అంగీకరించాయి. కర్బన వర్తకంపై ఉన్న దీర్ఘకాలిక సమస్యలనూ పరిష్కరించాయి. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పెద్ద దేశాలు 2022 చివరి నాటికి కఠిన నియంత్రణ లక్ష్యాలను ప్రకటించాలని ఒప్పందం స్పష్టం చేసింది.
'ప్రపంచానికి ఇది మంచి ఒప్పందం. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే, మొత్తంగా చూసుకుంటే మాత్రం చాలా మంచి ఒప్పందమే' అని అమెరికా వాతావరణ రాయబారి జాన్ కెర్రీ పేర్కొన్నారు. చైనా సైతం ఒప్పందంపై సానుకూలంగానే స్పందించింది. ఈ స్థితిలో గ్లాస్గోలో కుదిరే ఒప్పందం ఏదైనా మంచిదేనని వ్యాఖ్యానించింది.
ఐరాస ప్రతిపాదనలు డీలా
గ్లాస్గో చర్చలకు ముందు ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి (COP26 UN climate summit) మూడు కీలక ప్రతిపాదనలు చేసింది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించడం, పేద దేశాలకు ధనిక దేశాలు 100 బిలియన్ డాలర్లను సహాయంగా ఇవ్వడం, ఇందులో సగం నిధులు పర్యావరణ మార్పులను ఎదుర్కొనేలా అభివృద్ధి చెందిన దేశాలు ఉపయోగించుకునేలా చూడటం వంటి సూచనలు చేసింది ఐరాస. ఇవేవీ చర్చల్లో ఫలించకపోవడం గమనార్హం.
"పెళుసైన మన భూగోళం సన్నని దారానికి వేలాడుతోంది. పర్యావరణ విపత్తులను మనం కొని తెచ్చుకుంటున్నాం" అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. "ఈ సదస్సులో మనం మన లక్ష్యాలను సాధించలేదు. కానీ పురోగతి దిశగా అడుగులు వేశాం" అని మరో ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: