ఫ్రాన్స్‌లోని చర్చిలో లైంగిక వేధింపుల కేసులో(france catholic church abuse) బయటకు వచ్చిన ఓ నివేదిక కలకలం సృష్టిస్తోంది. ఫ్రాన్స్ క్యాథలిక్ చర్చిలో గడిచిన 70ఏళ్లలో ప్రార్థనా మందిరాల్లో 3,30,000మంది చిన్నారులు లైంగిక వేధింపుల బారినపడినట్టు నివేదిక పేర్కొంది(france catholic church news).
శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టు.. ఈ వ్యవహారంపై ఏర్పాటైన స్వతంత్ర దర్యాప్తు కమిషన్ అధ్యక్షుడు జీన్ మెర్క్ సావే వెల్లడించారు. మతపెద్దలు, ఇతర మతస్థులు.. చిన్నారులను వేధించిన ఘటనలను కూడా నివేదికలో బయటపెట్టినట్టు స్పష్టం చేశారు.
"బాధితుల్లో 80శాతం మంది పురుషులే ఉన్నారు. బాధితులపై లైంగిక వేధింపుల అనంతర పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వారిలోని 60శాతం మంది పురుషులు, మహిళల శృంగార జీవితం నాశనమైంది."
--- జీన్ మెర్క్, స్వతంత్ర దర్యాప్తు కమిషన్ అధ్యక్షుడు.
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో సుమారు 3వేల మంది అప్పుడు విధుల్లోనే ఉన్నట్టు నివేదిక అంచనా వేసింది. మొత్తం మీద 3.3లక్షల మంది చిన్నారుల్లో 2,16,000మందిపై మతపెద్దలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. 2500 పేజీల నివేదిక బయటపెట్టింది.
22 కేసులను ప్రాసిక్యూటర్స్కు అప్పగించినట్లు చెప్పారు సావే. నిందితులు బతికి ఉన్న 40కిపైగా పాత కేసులను చర్చి అధికారులకు ఫార్వర్డ్ చేశామన్నారు. 1950 నుంచి 1970 వరకు బాధితుల పట్ల చర్చి పూర్తిగా ఉదాసీనంగా ఉందన్నారు. లైంగిక వేధింపుల సమస్యలకు పరిష్కారం కనుగొనటం, కారణాలను గుర్తించటం, వాటి పరిణామాలను ప్రజలకు తెలియజేయటమే తమ లక్ష్యమని సావే చెప్పారు.
ఇదీ చూడండి:- చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు- 3వేల మంది నిందితులు!