ప్రపంచంపై కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న డెల్టా వేరియంట్.. ఇప్పటికే 135 దేశాలకు చేరినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వచ్చే వారానికి ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. ఈ మేరకు కొవిడ్-19 వీక్లీ రిపోర్ట్‌లో పేర్కొంది.
" 132 దేశాల్లో బీటా వేరియంట్ కేసులు రాగా.. గామా వేరియంట్ 81 దేశాల్లో వెలుగు చూసింది. ఆల్ఫా వేరియంట్ 182 దేశాలు, డెల్టా వేరియంట్ 135 దేశాలకు పాకింది. జులై 26 నుంచి ఆగస్టు 1 వరకు కొత్తగా 40లక్షల కేసులు వెలుగు చూశాయి. అందుకు తూర్పు మధ్యధరా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల పెరుగుదలే కారణం. గత వారం ఆయా ప్రాంతాల్లో వరుసగా 37, 33 శాతం వృద్ధి కనిపించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 9 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు.. గత వారం మరణాలు 8 శాతం మేర తగ్గి.. 64వేలు నమోదయ్యాయి. అయితే.. తూర్పు మధ్యధరా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కొత్త మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా 48, 31 శాతం పెరుగుదల కనిపించింది. "
- ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేసుల సంఖ్య 19.7 కోట్లు కాగా, మరణాలు 40.2 లక్షలు ఉన్నట్లు తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. వచ్చే వారంలోనే మొత్తం కేసుల సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా వేసింది.
వారంలో నమోదైన కొత్త కేసులు- టాప్ 5
దేశం | కొత్త కేసులు | మార్పు |
అమెరికా | 543420 | 9%(పెరుగుదల) |
భారత్ | 283,923 | 7%(పెరుగుదల) |
ఇండోనేసియా | 273,891 | 5%(తగ్గుదల) |
బ్రెజిల్ | 247,830 | 24%(తగ్గుదల) |
ఇరాన్ | 206, 722 | 27%(తగ్గుదల) |
ఆగ్నేయాసిలో 9 శాతం పెరుగుదలతో గత వారం మొత్తం 841,000 కొత్త కేసులు, 22,000 మరణాలు సంభవించాయి. ఈ ప్రాంతంలోని కొత్త కేసుల్లో 80శాతం వాటా భారత్, ఇండోనేసియా, థాయిలాండ్దే.
ఇదీ చూడండి: 'వారం రోజుల్లో 40 లక్షల కొత్త కేసులు'