చైనాలో పుట్టిన కరోనా అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ ఇబ్బందులు పెడుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కేసులు బయటపడగా అప్రమత్తమైంది ఆ దేశ ప్రభుత్వం. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే ఈ ప్రాంతంలో.. మే 20 నుంచి కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
అన్నీ బంద్..
ఈశాన్య చైనాలో భాగమైన జిలిన్ ప్రాంతంలో బస్సులు, రైళ్ల రాకపోకలను నిలిపేశారు. పాఠశాలలు, కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. శనివారం అకస్మాత్తుగా మూడు కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో రెండు కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.
కుటుంబంలో ఒక్కరికే..
కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అవలంబిస్తున్నట్టు జిలిన్ రాష్ట్రంలోని షులాన్ నగర ప్రభుత్వం తెలిపింది. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్న ప్రదేశాలను పూర్తిగా మూసివేసినట్టు వెల్లడించింది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని, అదీ ప్రతి రెండు రోజులకు రెండు గంటల పాటు మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు.
కారణాలేంటో..?
ఒక్కసారిగా ఇలా కేసులు పెరగడానికి కారణాలేంటో అధికారులు ఇంకా నిర్ధరించలేదు. రష్యాలో ఉండే చైనా పౌరులు తిరిగి రావడమే కారణమని కొందరు భావిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు దాదాపు 84 వేల మందికి పైగా కరోనా బారిన పడగా.. 4,600 పైగా మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా కేసుల్లో అగ్రస్థానం ఓ గౌరవ సూచిక: ట్రంప్