అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను గతంలో కాపాడిన అఫ్గానిస్థాన్‌కు చెందిన వ్యక్తి.. సురక్షితంగా ఆ దేశం నుంచి బయటపడ్డాడు. అమెరికా ప్రభుత్వం, సైన్యం సాయంతో.. తన కుటుంబంతో సహా పాకిస్థాన్ చేరుకున్నాడు అమన్ ఖలిలీ. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే.. అతడు ఉన్న ప్రాంతం గురించి రహస్యంగా ఉంచడమే మంచిదని అభిప్రాయపడింది.
తమ సేనలకు సాయం చేసిన వారికి ప్రత్యేకంగా యూఎస్ స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేస్తుంది అమెరికా. అయితే ఈ వీసా పొందడానికి ప్రయత్నించి విఫలమైన ఖలిలీ.. తనకు సాయం చేయాలని అమెరికాను కోరాడు. అప్పుడు సానుకూలంగా స్పందించిన బైడెన్ సర్కార్.. అతడిని రక్షిస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ జరిగింది..
బైడెన్(biden news).. 2008లో సెనేటర్‌గా ఉన్న రోజుల్లో ఓసారి అఫ్గాన్ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల పర్యటనల కారణంగా ఆయన హెలికాప్టర్‌ను మారుమూల గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. క్లిష్టపరిస్థితుల్లో బైడెన్ బృందాన్ని అన్వేషించడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ దుబాసి అమన్ ఖలిలీ.. భద్రతా దళాలకు సాయం చేశాడు. అలా బైడెన్ బృందాన్ని రక్షించగలిగాడు.
అయితే.. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ప్రాణభయంతో తనను, తన కుటుంబాన్ని కాపాడాలని అమెరికాను అభ్యర్థించాడు. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతడికి రక్షణ లభించినట్లయింది.
ఇదీ చూడండి: US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా!