భారత్ ఆర్థిక సాయంతో నేపాల్లోని ఇలం జిల్లాలో నిర్మించిన ఓ పాఠశాల భవనాన్ని సోమవారం ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
వేద, ఆధునిక విద్యలు బోధించే ఈ పాఠశాల... భవన నిర్మాణం కోసం భారత్ రూ.1.94 కోట్లు (నేపాలీ రూపాయల్లో 31.13 మిలియన్లు) ఆర్థిక సాయం అందించింది.
"'శ్రీ సప్తమై గురుకుల్ సంస్కృత విద్యాలయ' ఏర్పాటుకు 2009లోనే కృషి జరిగింది. వేద, ఆధునిక విద్యలు బోధించే ఈ పాఠశాల భవనం ఇప్పుడు పూర్తి అయ్యింది. ఈరోజు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్, నేపాల్ అధికారులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు."
- నేపాల్లోని భారత రాయబార కార్యాలయం
నాలుగు అంతస్తుల ఈ పాఠశాల భవనంలో 10 తరగతి గదులు, విద్యార్థుల కోసం తొమ్మిది వసతి గృహాలతో హాస్టల్ బ్లాక్, నాలుగు స్టడీ రూంలు, ఓ లివింగ్ రూం, వార్డెన్ కార్యాలయం, ఓ సమావేశ మందిరం ఉన్నాయి.
2015లో సంభవించిన భారీ భూకంపం ధాటికి నేపాల్లోని అనేక భవనాలు కుప్పకూలాయి. అనేక పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. దీనితో నేపాల్ విద్యార్థుల భవిత కోసం భారత్ అనేక పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక చేయూతనందించింది.
ఇదీ చూడండి: జవాన్లు ఎంతటి చలినైనా తట్టుకునేలా ప్రత్యేక టెంట్లు