కరోనా వైరస్‌కు సంబంధించి పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొవిడ్ 19 బాధితుల జీర్ణ వ్యవస్థలో వైరస్ జీవించగలదని, మలంలో కూడా దాని ఆనవాళ్లు ఉంటాయని చైనాలోని యాంగ్‌జౌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా గుర్తించారు. అందుకే టాయిలెట్ వాడిన తరవాత వెంటనే లిడ్‌తో దాన్ని మూసివేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు కంప్యూటర్ మోడల్ ద్వారా ఫ్లషింగ్ టాయిలెట్‌లో నీరు, గాలి ప్రవాహాన్ని అంచనా వేసి, వైరస్ ఆనవాళ్లపై ఓ అవగాహనకు వచ్చారు.
ఫిజిక్స్ అండ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైన వారి అధ్యయనం ప్రకారం.. ఫ్లషింగ్ వల్ల నీటి ప్రవాహంపై ఒత్తిడి ఉంటుందన్నారు. దాని వల్ల మన కంటికి కనిపించని అతి చిన్న పదార్థం గాల్లోకి చేరుతుందని పరిశోధకులు చెప్పారు. అది ఆ చుట్టుపక్కల ఉండిపోతుందని, ఆ సమయంలో లోపలకు వెళ్లిన వారి శరీరంలోకి వెళ్లిపోతుందని వివరించారు. 'ఫ్లషింగ్ వల్ల నీటి వేగం పెరిగి, వైరస్‌ను పైకి లేపుతుంది.
వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ముందుగా మూతవేసి, తరవాత ఫ్లష్ చేయాలి అని పరిశోధకుల్లో ఒకరైన జిగ్జియాంగ్ వాంగ్ వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. 'పబ్లిక్ టాయిలెట్, బీజీ సమయంలో కుటుంబ సభ్యులు ఉపయోగించే టాయిలెట్‌లో ఈ వేగం ఎక్కువగా ఉంటుంది' అని వాంగ్ హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిలో టాయిటెట్ల పాత్ర ఇంకా నిరూపణ కాలేదని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయోలజిస్టు చార్లెస్ పి గెర్బా వాషింగ్టన్ పోస్టుకు వెల్లడించారు.
ఇదీ చూడండి:అమరజవాన్లకు సంఘీభావంగా భాజపా ర్యాలీల వాయిదా