కృత్రిమ మేధతో నడిచే చోదక రహిత కారు టాక్సీలను తీసుకొచ్చింది చైనా టెక్ దిగ్గజం బైడు. ఈ టాక్సీలను ఆదివారం ప్రారంభించింది. దీంతో తనంతట తానుగా నడిచే టాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి సంస్థగా నిలిచింది. ఈ టాక్సీలు డ్రైవర్ లేకుండానే.. ప్రయాణికులను గమ్యస్థానాలకు కచ్చితంగా, సురక్షితంగా చేర్చాయి. అయితే ప్రయాణికులు వెనుక సీటులో కూర్చోగా.. అత్యవసర సమయాల్లో సహాయం కోసం డ్రైవర్ పక్కసీటులో ఓ భద్రతా సిబ్బంది కూర్చున్నారు.
ఒక్కరైడ్కు 4.6 డాలర్లు
బీజింగ్‌లోని షాంగాంగ్ పార్క్‌లో ఈ టాక్సీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పదికిపైగా అపోలా టాక్సీలు.. ప్రయాణికులను ఎక్కించుకుని, 3 చదరపు కిలోమీటర్లు పరిధిలో ఎనిమిది గమ్యస్థానాలకు చేర్చాయి. ఒక్కో రైడ్‌కు 30 యూవన్లు (4.6 డాలర్లు) చొప్పున ఛార్జీ చేసింది ఆ సంస్థ.
థ్రిల్లింగ్ రైడ్..
రోబో కారులో ప్రయాణం చేసిన ఔత్సాహికులు.. తమకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని చెబుతున్నారు.
అపోలో గో యాప్
ఈ టాక్సీని 'అపోలో గో యాప్' ద్వారా బుక్ చేసుకోవచ్చు. టాక్సీ తమ దగ్గరకు చేరుకోగానే.. వారి గుర్తింపును ధ్రువీకరించి.. తమ హెల్త్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత కారులోకి ఎక్కాలి. ప్రయాణికులు తమ సీటు బెల్ట్ ధరించి సౌకర్యంగా కూర్చున్న తర్వాతే కారు కదులుతుంది.
30 నగరాలకు విస్తరిస్తాం!
గతేడాది నుంచి బహిరంగ రహదారులపై చోదక రహిత కార్లను పరీక్షిస్తోంది బైడు. అపోలో గో రోబోటాక్సీ సేవల ద్వారా చైనాలోని మూడు నగరాల్లో 2 లక్షల 10 వేల మందికి పైగా ప్రయాణికులను తరలించిందని.. ఈ సేవలను రాబోయే మూడేళ్లలో 30 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి: చైనా యాప్‌లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!