కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందటంపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). గురువారం 1,50,000లకు పైగా కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ.. రోజువారీ కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డుల నమోదుపై ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
కొత్త కేసుల్లో సగానికిపైగా అమెరికాలోనే ఉన్నట్లు పేర్కొన్నారు డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్ అధనామ్. దక్షిణ ఆసియా, పశ్చిమాసియా దేశాల్లోనూ గణనీయంగా పెరుగుదల ఉందని తెలిపారు.
"మనం ప్రమాదకర దశలో ఉన్నాం. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కఠిన నియంత్రణ చర్యలు తప్పనిసరి. ప్రజలు ఇంట్లో ఉండటంపై విసుగు చెందారు. చాలా దేశాలు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ప్రజలు బయటకి వస్తున్న క్రమంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భౌతిక దూరం, మాస్కు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం వంటి నివారణ చర్యలు కచ్చితంగా పాటించాలి."
- టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్ఓ అధినేత.
80 శాతం ఆ దేశాల్లోనే..
వలస కార్మికుల్లోనే కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు టెడ్రోస్. అందులో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నట్లు తెలిపారు. శరణార్థుల్లో కరోనా వ్యాప్తిని గుర్తించటం, నిరోధించటంపై తమకు బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: 'నానోస్పాంజెస్'తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట!