పుట్టినరోజునాడు ప్రతి ఒక్కరూ తమ కోరికల జాబితాలోని ఏదో ఒకదానిని నేరవేర్చుకుంటుంటారు. కొందరు విదేశాలకు వెళ్తే.. మరికొందరు తమకు ఇష్టమైన గుడికో, లేక నచ్చిన ప్రాంతానికో వెళ్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఆలోచించింది అమెరికా- రోక్స్బోరోకు చెందిన వందేళ్ల బ్రయాంట్ అనే వృద్ధురాలు. కారాగారంలో ఖైదీగా ఉండాలన్న తన కలను 100వ పుట్టినరోజు సందర్భంగా నెరవేర్చుకుంది ఈ బామ్మ. పర్సన్ కౌంటీ అధికారుల సాయంతో బ్రయాంట్ కల నెరవేరింది.
చేతులకు బేడీలతో...
బ్రయంట్ కోరిక ప్రకారం.. ఆమెను ఇంటి నుంచి చేతులకు బేడీలు వేసి ఖైదీలను తీసుకెళ్లినట్లుగానే కార్లో ఎక్కించి తీసుకెళ్లారు ఇద్దరు అధికారులు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లేటప్పుడు రహదారి వెంట సైరన్‌ను కూడా మోగించారు.
అయితే... తన కల నెరవేరుతున్న ఆనందంలో బ్రయాంట్ పోలీసులతో సరదాగా కవ్వింపు చర్యలకు పాల్పడింది. మాతో గొడవ పడొద్దని అధికారులు చెబుతున్నా.. ఓ పోలీసును సరదాగా కాలితో తన్నింది. అందుకు స్పందించిన ఆ అధికారి తనకు ఒక మోకాలు సరిగా లేదని చెప్పాడు. అయితే తనకు రెండు మోకాళ్లు సరిగా లేవని ఛలోక్తి విసిరింది బ్రయాంట్.
బ్రయాంట్ హర్షం..
అలా జన్మదినం నాడు కాసేపు జైల్లో ఖైదీలా గడిపిన బ్రయాంట్.. తనకు ఇదొక కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం బయటికొచ్చిన ఆమె... కేక్ కట్ చేసి తన 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.
ఇదీ చదవండి: ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో ఇక అవి బంద్!