అమెరికా న్యూయార్క్లో కరోనా మరణాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలను సడలిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో నిర్ణయం తీసుకున్నారు. దీనితో రెండు నెలలుగా ఇళ్లలోనే మగ్గిపోతున్న న్యూయార్క్ వాసులకు మెమోరియల్ డే వారాంతంలో కాస్త ఉపశమనం కలిగింది. ఆంక్షలు సడలించినప్పటికీ... చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రజలు బయటకు రావడం గమనార్హం.
కరోనా అప్డేట్స్
న్యూయార్క్లో రోజువారీ కరోనా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏప్రిల్ 8న అయితే గరిష్ఠంగా 799 మంది కరోనా సోకి మరణించగా... ఈ శనివారం కనిష్ఠంగా 84 కరోనా మరణాలు నమోదయ్యాయి.
"కొన్ని వారాల క్రితం కరోనా మరణాల సంఖ్యను 100 కంటే తక్కువకు పరిమితం చేయడం అసాధ్యం అనిపించింది. కానీ ఇప్పుడు క్రమంగా మరణాల సంఖ్య తగ్గిపోతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా 4,600 వరకు పడిపోయింది."
- ఆండ్రూ క్యూమో, న్యూయార్క్ గవర్నర్
న్యూయార్క్ నగరానికి ఉత్తరాన, అల్బానీకి దక్షిణాన ఉన్న మిడ్ హడ్సన్ ప్రాంతంలో మంగళవారం నుంచి ఆంక్షలు తొలగిస్తున్నట్లు ఆండ్రూ క్యూమో తెలిపారు. దీని తరువాత లాంగ్ ఐలాండ్లోనూ ఆంక్షలు ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.
ఇవి తప్పనిసరి
గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం... న్యూయార్క్ ప్రజలు గరిష్ఠంగా 10 మంది వరకు సమావేశం కావచ్చు. ప్రజలు ఒకరికొకరు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. అలా వీలుకానప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
తాజా సడలింపులతో న్యూయార్ ప్రజలు తమ స్నేహితులతో కలిసి ఉద్యానవనాల్లో, తమ పెరట్లో పిక్నిక్ చేసుకోవచ్చు. వారాంతంలో సాగర తీరాలకు విహారానికి వెళ్లవచ్చు. కానీ ఈతకొట్టకూడదు. బీచ్లలో కనీసం రక్షించడానికి లైఫ్ గార్డులు కూడా ఉండరు.
ఇదీ చూడండి: వందేళ్ల కిందటే: మాస్కులు పెట్టండయ్యా బాబూ!