కరోనా వైరస్‌కు వాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలాకాలం పడుతుందని మోడర్నా థెరపాటిక్స్ సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ తెలిపారు. 2020 జులైలోపు అందించేందుకు ఏ ఫార్మా సంస్థ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
"ఇది ఆర్ఎన్ఏ సాంకేతికతపై ఆధారపడి ఉంది. మెస్సెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) సంబంధిత సమాచార అణువులు.. ప్రొటీన్ల పెరుగుదల, వ్యాధి కణాలపై పోరాడుతాయి. మనుషులపై ప్రయోగించే స్థాయికి రాగలిగితే పని సులభమవుతుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. చాలా ట్రయల్స్ చేసిన అనంతరమే విడుదల చేయగలం. ఫలితంగా ఈ ఏడాది వేసవికాలం ముగిసే వరకూ ఈ వ్యాక్సిన్ తీసుకురావటం కష్టమే."
- స్టీఫెన్ బాన్సెల్
ఇప్పటికే 200 మందిని బలి తీసుకున్న నావెల్ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని అంతర్జాతీయ సంస్థలతో కలిసి మోడర్నా.. తీవ్రంగా కృషి చేస్తోందని బాన్సెల్ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థతో కలిసి మోడర్నా పనిచేస్తుండగా.. ఇనావియో ఫార్మాసుటికల్స్, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం వేర్వేరుగా ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటికీ అంటువ్యాధుల సన్నద్ధత, ఆవిష్కరణల కూటమి నిధులు అందిస్తోంది.