Vijayendra Prasad Gandhi: అంగరంగ వైభవంగా ఏర్పాటైన వేడుక అది.. వందల మంది అతిథులు.. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' తదితర సూపర్‌హిట్ చిత్రాల కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వేదికపై ఏం మాట్లాడతారా? అని అంతటా ఆసక్తి నెలకొంది. ఆయన ఎక్కువగా ప్రసంగించకుండా.. వ్యాఖ్యాత ప్రశ్నకు సమాధానం చెప్పిన తీరు నవ్వులు పూయించింది. "రచయితల వల్లే నటులు, యాంకర్లు తదితరులకు మనుగడ ఉంది. కాబోయే రైటర్లకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?" అని కార్యక్రమ వ్యాఖ్యాత అడగ్గా విజయేంద్ర ప్రసాద్ రూ. 100 నోటు చూపిస్తూ నాకు గాంధీజీ స్ఫూర్తి అని అన్నారు. అవసరం (డబ్బు) అన్నీ నేర్పిస్తుంది అన్న భావంతో ఆయన మాట్లాడారు. దాంతో, అతిథుల చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది.
గోవాలో ఆదివారం జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కార్యక్రమంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. నేటి నుంచి ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ వేడుక ప్రారంభానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అజయ్‌దేవ్‌గణ్‌తోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే ఈవెంట్‌లో ప్రముఖ నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ- 2022 అవార్డు ప్రకటించింది.