Tollywood film shootings Band: తెలుగు సినిమా షూటింగ్స్ బంద్‌పై గందరగోళం సాగుతోంది. ఫిల్మ్ చాంబర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు నిర్మాతలు షూటింగ్స్ కొనసాగిస్తున్నారు. వాటిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు', సితార ఎంటర్టైన్మెంట్స్లో ధనుష్ 'సార్' చిత్రీకరణలు జరుగుతున్నాయి. కాగా, సినిమా చిత్రీకరణల బంద్‌పై ఫిల్మ్ ఫెడరేషన్‌కు లేఖ అందలేదని తెలిసింది. ఈ క్రమంలోనే బంద్‌పై స్పష్టత లేకపోవడంతో సినిమా షూటింగ్స్ కార్మికులు వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సినిమా షూటింగ్స్ బంద్‌పై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
తాను తెలుగు సినిమా షూటింగ్‌లు చేయట్లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ హీరోగా తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. చిత్రీకరణల విషయమై టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన వివరణ ఇచ్చారు. తెలుగు సినిమాల షూటింగ్స్ మాత్రమే బంద్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు చిత్రీకరణలు ఆపేద్దామన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల అభిప్రాయానికి చలన చిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇతర భాషలకి చెందిన సినిమాల చిత్రీకరణలు యథావిధిగా కొనసాగించేందుకు అనుమతినివ్వడం వల్ల విజయ్ 'వారిసు', ధనుష్ 'సార్' తదితర తమిళ చిత్రాలు సోమవారం షూటింగ్స్ జరిగాయి. ఇవి తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందే సినిమాలు కావడం వల్ల పలువురు నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా బంద్‌కు పిలుపునిస్తే ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమే 'వారిసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రాబోతుంది. రష్మిక కథానాయిక. ఈ సినిమా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.
ఇదీ చూడండి: అర్థరాత్రి మేకప్.. తెల్లారేసరికి ఫస్ట్ షాట్.. 120 రోజుల్లో రూ.500 కోట్లతో..