ఇటీవలే 'విరాటపర్వం'తో వెన్నెలగా ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి. ఇప్పుడు 'గార్గి'తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రమిది. గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సమర్పించనున్నారు ప్రముఖ నటులు సూర్య - జ్యోతిక.
ఈ విషయాన్ని సూర్య శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దిగిన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
మనిషి అలా బతకొద్దు: అనసూయ భరద్వాజ్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో జయశంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అరి'. శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ "దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడే నాకు కుతూహలం కలిగింది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంది. ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఇందులో చాలా ఎంటర్‌టైన్‌గా చూపించారు దర్శకుడు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది" అన్నారు.
"అరి అనేది సంస్కృత పదం. దానికి శత్రువు అని అర్థం. టైటిల్ ఎందుకిలా పెట్టాను అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నా 'పేపర్‌బాయ్' కంటే ఈ చిత్రానికి మరింత పేరు వస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు చిత్ర దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ "మనిషి ఎలా బతకాలో ఇంతకు ముందు సినిమాలు చూపించాయి. ఈ చిత్రంలో మనిషి ఎలా బతక కూడదో చూపించాం. ఇందులో మంచి కామెడీ ఉంది" అన్నారు. ఈ కార్యక్రమంలో వై.రవిశంకర్, బుచ్చిబాబు, అనూప్ రూబెన్స్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సెన్సేషనల్ సాంగ్‌కు 'రకుల్' డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్