Sharat Saxena Biceps : 'ముఠా మేస్త్రీ' సినిమాలో "ఒక ప్రాణం తీసా.. ఒక ప్రాణం పోసా.. లెవలైపోయింది" అంటూ కరుడుగట్టిన విలన్ రోల్లో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు బాలీవుడ్ నటుడు శరత్ సక్సేనా. అంతకుముందు 'ఘరానా మొగుడు' , 'అశోక చక్రవర్తి', 'నిర్ణయం' లాంటి సినిమాల్లో నటించిన ఆయనకు 'ముఠామేస్త్రి' మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఈయన సౌత్ ఇండస్ట్రీలో తెగ పాపులర్ అయిపోయారు. తెలుగు వారికి కూడా దగ్గర అయ్యారు. ఆ తర్వాత తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేశారు.
గత కొంత కాలంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన.. ఇటీవలే తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఏడు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీని మేయింటేన్ చేస్తున్నారు. తాజాగా వర్కౌట్‌కు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టా అకౌంట్లో పంచుకున్నారు శరత్. 1970లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన సక్సేనా అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో కనిపించారు.
ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. "ఈ జెనరేషన్ యూత్ సైతం మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలి.. ఏడు పదుల వయసు దాటినా.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు.. మీరు సూపర్ సార్".. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ' శరత్ సక్సేనా ఇండియన్ ట్రిపుల్ హెచ్ ' అన్నాడు. ' మీరు అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ' అంటూ శరత్ పాత సినిమాతో పోల్చాడు మరో నెటిజన్.
'గులాం', 'క్రిష్', 'హసీ తో ఫాసీ', 'బజరంగీ భాయిజాన్', 'షెర్నీ'తో పాటు దాదాపు 250కి పైగా హిందీ చిత్రాల్లో నటించాడు. ఇక తెలుగులో 'ఎస్.పి. పరశురామ్', 'బంగారు బుల్లోడు', 'గాంఢీవం', 'ముగ్గురు మొనగాళ్లు' లాంటి హిట్ సినిమాల్లోనూ నటించారు. కొంత గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'సింహాద్రి' సినిమాలో కేరళ రాష్ట్ర పోలీసు పాత్రలో నటించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'బన్నీ' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. 'మహాభారత్'తో పాటు 'సజన్ రే ఫిర్ ఝూత్ మత్ బోలో' వంటి టీవీ సిరీస్‌లలో ఈయన నటించారు.