ఆమె కరుణిస్తే మలయమారుతం. ఆగ్రహిస్తే ప్రళయ జంఝామారుతం. ఆ కళ్లు వయ్యార మొలికిన నయగారాలు. నయన నయాగరాలు. కలువల్లాంటి కళ్లు. చక్రాల్లాంటి కళ్లు.. అభివర్ణనలు ఏవైనా అభినేత్రి జమున విశాలనేత్రి. కళ్లతో కోటిభావాలు ప్రకటించారు. కనుబొమ్మల భాషలో, కనులతో నటించారు. నాలుగు భాషల్లో, 198చిత్రాలలో నటించిన మేటి నటి. జగమే ఊయలలూపిన వెండితెర వెన్నెల. మహిళల స్వాభిమాన జమీందారిణి. ఆత్మవిశ్వాసం నిండుగా నింపిన 'జమునా తీరం'.. కళామతల్లి మణిహారం.
హంపి టూ గుంటూరు .. హంపిలో పుట్టిన కన్నడ కస్తూరి జమున. తెలుగువారి దత్తపుత్రిక. తల్లిదండ్రులతో చిన్నప్పడే గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చి స్థిరపడటం వల్ల జమున తెలుగమ్మాయిగా మారిపోయింది. తన వెండితెర ప్రయాణానికి ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు సినిమా ' పుట్టిల్లు' తొలిమజిలీ అయ్యింది. తెలుగు నేల ఆమె పుట్టిల్లయ్యింది. ఆకర్షణీయ రూపం, స్పష్టమైన వాచకం, భాషా ఉచ్ఛారణలో స్ఫటిక స్వచ్ఛత, స్పష్టత నేర్చిన జమున.. సంగీత, నాట్యాలతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
1955 మిస్సమ్మ.. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1955లో వచ్చిన హాస్యభరిత చిత్రం 'మిస్సమ్మ' ఒక క్లాసిక్. జమున నటిగా తనను తాను నిరూపించుకున్న సినిమా. ఇందులో ' బృందావనమది అందరిదీ..గోవిందుడు అందరివాడేలే' పాటకు జమున అభినయం అపూర్వం. సావిత్రితో పోటీపోటీగా నటించింది. భాగ్యరేఖ(1957)లో బీఎన్ రెడ్డి దర్శక ప్రతిభ చూడాలంటే మరో సినిమాలో ఈ పాట సందర్భాన్ని గమనించాలి. పువ్వులు కోస్తున్న కథానాయకి ఏకకాలంలో అటు దైవానికి , ఇటు తన మనోభిరాముడికి చేసే నివేదన దర్శక సమయస్ఫూర్తికి నిదర్శనం.
అనంతరం అప్పుచేసి పప్పుకూడు, గులేబకావళి కథ, బొబ్బిలి యుద్ధం, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, గుండమ్మ కథ, మూగమనసులు, మంచి మనిషి, లేతమనసులు, రాము, మూగనోము, పండంటి కాపురం, కలెక్టర్ జానకి, మనుషులంతా ఒక్కటేలో జమున నటన తారస్థాయిలో ఉంది.
అగ్రహీరోలతో.. విశాలనేత్రి, అందాల అభినేత్రి జమున ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావుతో అత్యధిక సినిమాలలో నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌తో పొరపొచ్ఛాల వల్ల కొంతకాలం వారి సినిమాలలో అవకాశాలు రాలేదు. దాంతో ఆ సమయంలో ఆమె జగ్గయ్య, హరనాథ్, కృష్ణ, శోభన్ బాబులతో కలసి 15 సినిమాలలో నటించారు. వాటిలో అత్యధిక సినిమాలు విజయం సాధించాయి. హీరో కృష్ణ తో అమాయకుడు, అల్లుడే మేనల్లుడు, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో నటించారు. 1974లో వచ్చిన దేవుడు చేసిన మనుషులులో అతిథి పాత్రలో మెరిశారు.
సత్యభామంటే జమునే.. శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్. సత్యభామంటే జమున. ఆ పాత్రలకు వారేకరెక్టు అని ప్రేక్షకలోకానికి ఒక నమ్మకం ఏర్పడింది. సినీ సత్యభామ అంటే తనే అన్నంతగా జమున ఆ పాత్రలో ఒదిగిపోయారు. సత్యభామ జడవిసుర్లు,వాలుకళ్ల వయ్యారాన్ని చక్కగా అభినయించారు. తొలిసారిగా 1958లో సముద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో వచ్చిన 'వినాయక చవితి' సినిమాలో సత్యభామ పాత్ర ఆమెకు ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చింది. సినీ సత్యభామకు ఒక నడకలు నేర్పిన ఖ్యాతి జమునది. తర్వాత భు కైలాస్‌లో మండోదరి పాత్రలో ఎంత మెప్పించినా.. వినాయక చవితికతో సత్యభామ ప్రేక్షకుల స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. అందుకే మళ్లీ అలాంటి పాత్రలను దర్శకులు జమునకోసమే సృష్టించారు. అతిశయం అణచివేసే తరహా గర్వభంగం పాత్రలు తెలుగువారికెంతో ఇష్టం. వారి అభిరుచికి అనుగుణంగా 1966లో వచ్చిన సురేశ్ ప్రొడక్షన్స్ 'శ్రీకృష్ణ తులాభారం' అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రకు, జమున సత్యభామ పాత్రకు సరిగ్గా సరిపోయారని ప్రేక్షకలోకం విశ్వసించింది.
తెలుగువారి నర్గీస్ జమున.. జమున.. తెలుగు, కన్నడ, తమిళం, హిందీలో ఆమె 198 సినిమాల్లో నటించారు. తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించి పాతికేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నారు. అభిమానులు జమునను హంపీ సుందరిగా, తెలుగువారి నర్గీస్గా అభివర్ణిస్తారు. జమున అసమాన నటనా విశిష్టతను గుర్తిస్తూ 1999లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ పురస్కారంతో, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో గౌరవించాయి. 85 వసంతాల వయసు. అదే చలాకీ తనం. అదే ఉత్సాహం.. ఇటీవల మిస్సమ్మ సినిమాలో తన పాటకు తనే మళ్లీ అభినయించిన దృశ్యాలు వీక్షకులను ఆశ్చర్యపరిచాయి.
అభిమానుల ఇలవేల్పు.. అభినయం ఒక ఆశయం. నిత్యవసంతం. ఇగిరిపోని గంధం. జన్మజన్మల కళానుబంధం. ఎనభై ఐదు వసంతాలలో ఉత్సాహం. 'మళ్లీ మళ్లీ మావిడి కొమ్మ పూయును లె' ఆమె పాటే చెబుతుంది. చిత్ర విజయాల బాటే చెబుతుంది. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి జమున వెండితెర జీవితం నిలువెత్తు నిదర్శనం. అన్నపూర్ణమ్మగారి మనవడు సినిమాలో అతిథిపాత్రతో అలరించి నటన ఎప్పటికీ తన 'తోడూ-నీడ' అని జమున నిరూపించారు. ఆమె వెండితెర వేల్పు. నేటికీ నీరాజనాలు అందుకుంటున్న అభిమానుల ఇలవేల్పు.
ఇదీ చూడండి: సీనియర్ నటి జమున కన్నుమూత