కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్కే భగవాన్(90) కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు నెలలుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
1933 జులై 5న జన్మించిన భగవాన్.. చిన్న వయసులోనే హిరన్నయ్య మిత్ర మండలితో కలిసి వీధి నాటకాలు వేయడం ప్రారభించారు. ఆ తర్వాత 1956లో కనగల్ ప్రభాకర్ శాస్త్రికి సహాయకుడిగా పనిచేశారు. అనంతరం 1967లో విడుదలైన రాజదుర్గాద రహస్య చిత్రానికి సహాయ-దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత మరో దర్శకుడు దొరై రాజ్‌తో కలిసి 'జేదర బలే' దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రసీమలో తొలిసారి జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను రూపొందించింది వీరే.
![Kannada Senior director sk Bhagwan passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17799906_thumbnail_4x3_sefed_2002newsroom_1676868499_275.jpg)
వీరిద్దరూ కలిసి 'కస్తూరి నివాస,' 'ఏడు కనసు', 'బయలుదారి', 'గాలిమాటు', 'చందనద గొంబె', 'హోస వెలుగు', 'బెంకియ బలే', 'జీవన చైత్ర' వంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. జేమ్స్ బాండ్ తరహా చిత్రాలైన 'గోవా దల్లి C.I.D 999,' ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి C.I.D 999 వంటి సినిమాలు తీశారు. వీరు తెరకెక్కించిన అత్యధిక సినిమాల్లో దివంగత కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ హీరో కావడం గమనార్హం. దొరై- భగవాన్లు అనేక నవలలను ఆధారంగా తీసుకుని సినిమాలు తీశారు. వీరిద్దరి చివరి చిత్రం బలూ చూడరంగ్. అయితే 2000లో దొరై రాజ్ మరణించిన తర్వాత.. భగవాన్ సుదీర్ఘ విరాము తీసుకున్నారు. చివరగా 2019లో అడువా గొంబే అనే సినిమాకు భగవాన్ దర్శకత్వం వహించారు
సీఎం సంతాపం..
దర్శకుడు ఎస్కే భగవాన్ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. "కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు శ్రీ ఎస్కే భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నాను. దొరై-భగవాన్ కాంబో కన్నడ సినీ అభిమానులకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందిచారు. 'కస్తూరి నివాస్', 'ఎరడు సోయం', 'బయలు దారి', 'గిరి కన్యే', 'హోసా లేకక్' సహా 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓం శాంతి" అని సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: అలా యాక్ట్ చేయడం విశ్వనాథ్ దగ్గరే నేర్చుకున్నా.. నా డైలాగ్ స్పీడ్ తగ్గించిందీ ఆయనే: చిరంజీవి