Chiranjeevi Ramcharan Acharya movie: దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో రూపుదిద్దుకున్న సినిమా 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. పుజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన మూవీ టీమ్ తాజాగా ఓ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా చిరు, చరణ్, కొరటాల పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే చిరు.. చరణ్‌తో పోటీ పడేందుకు చాలా టెన్షన్ పడినట్లు తెలిపారు.
" 'నాటునాటు' సాంగ్ ప్రోమో చూశాక నాకన్నా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అనిపించింది. ఈ రేంజ్లో నేను చేయగలనా అనే టెన్షన్ వచ్చింది. 'రేసుగుర్రం' సినిమాలో శ్రుతిహాసన్‌లా ఫీల్ అయ్యా. ఇదే విషయం కొరటాలకు కూడా చెప్పాను. 'నాటు నాటు' స్థాయిలో అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత సెట్స్‌లో ఇద్దరు బాగా చేశాం. ఇక రామ్‌చరణ్‌తో జర్నీ 'ఆచార్య'తో మొదలైంది కాదు. అతడిని చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నా(నవ్వుతూ). మొట్టమొదటి సినిమా నుంచి చూస్తున్నా. డెవలప్ అవుతూ వచ్చాడు. అయితే నటన విషయంలో ఇప్పటి వరకు అతడికి నేను ఎలాంటి సలహా ఇవ్వలేదు. చాలా పరిణతి చెందాడు. తండ్రిగా, ఓ తోటి నటుడిగా చాలా గర్వపడుతున్నా." అని చిరు అన్నారు.
నిజజీవితంలో మీ 'ఆచార్య' ఎవరు?
చిరు: నేనెప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటాను. ఎందుకంటే చాలా విషయ పరిజ్ఞానం పొందవచ్చు. ప్రతి రోజు నాకు ఎదురయ్యే సంఘటన, మనుషులు, వారు మాట్లాడే ప్రతి మాట నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. మొత్తంగా ప్రతిఒక్కరిలోనూ 'ఆచార్య'ను చూస్తాను.
రామ్‌చరణ్ ద్వారా మీరేమైనా నేర్చుకున్నారు?
చిరంజీవి: చరణ్ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది. దర్శకుడు అనుకున్నది వచ్చిందా? లేదా? అని చూసుకునేంత వరకూ కెమెరా ముందే ఉంటాడు. డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. నేను పాటించే ప్రతి పద్ధతినీ తనూ అనుసరిస్తున్నాడు. ఇక సీన్ అయిపోయిన తర్వాత కారావ్యాన్‌లోకి వెళ్లిపోకుండా సెట్‌లో అందరితోనూ కలివిడిగా ఉంటాడు. నేను కూడా అలాగే చేసేవాడిని. రకరకాల వంటకాలు చేయించి, అందరికీ అందేలా చూస్తాడు. అయితే, ఈ సినిమాకు మాత్రం మారేడుమిల్లిలో ఉండగా నాకు అన్యాయం జరిగింది. సురేఖను రమ్మంటే 'వద్దు అమ్మా రావొద్దు' అని ఆపేశాడు. 'అమ్మ వస్తే నేను నీతో ఉండే సమయం తగ్గిపోతుంది. ఇలా కలిసి ఉండటం సాధ్యం కాదు' అంటూ సురేఖను ఆపేశాడు. (నవ్వులు)
సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చరణ్‌ను తండ్రి తగ్గ తనయుడు అంటారా?
కొరటాల శివ: చిరంజీవిగారి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది. తెరపై ఆయన ఉంటే కళ్లు మరొకరిపై ఉండవు. మారేడుమిల్లిలో ఒక సీన్ తీసిన తర్వాత మాకున్న భయమంతా పోయింది. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి మరిపించేలా చరణ్ కనిపిస్తారు.
చిరంజీవి: నేను 1 నుంచి 150 సినిమా వరకూ నేర్చుకుంటూ వచ్చా. చరణ్ నా 150 సినిమాలను చూసి అక్కడి నుంచి తన ప్రయాణం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నాడు. నేను 'అ ఆ'ల నుంచి మొదలు పెడితే చరణ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు.
చిరంజీవి సినిమా అంటే థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు టికెట్ రేట్లు పెంచటం అవసరమా?
కొరటాల శివ: సినిమా బడ్జెట్ బట్టి టికెట్ రేట్లు పెంచాం తప్ప. పెంచాలి కాబట్టి ధరలు పెంచలేదు.
చిరంజీవి: కరోనా సమయంలో ప్రతి సంస్థ, రంగం కుదేల్ అయిపోయాయి. అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపు ఏమీ కాదు. సినిమాలు ఆగిపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. టికెట్ ధరలు పెంచి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాలను వేడుకున్నాం. ప్రజలపై భారం పడకుండా ధరలు పెంచారు
ఇదీ చూడండి: ప్రభాస్‌ను మించేలా ఎన్టీఆర్‌తో ఊర మాస్ సినిమా!