పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా.. 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, మరో 25 శాతం పెండింగ్‌లో ఉంది. ఈ సినిమా పూర్తవ్వాలంటే కనీసం నెలరోజులైనా కేటాయించాల్సి ఉంటుంది. అయితే వరుస సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ 'ఓజీ' సెకెండ్ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సెకెండ్ షెడ్యూల్లో పాల్గొననున్నారు.
అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తైన నేపథ్యంలో మొదటి భాగాన్ని త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాత స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మిగతా షూటింగ్ పూర్తి చేసి రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అయితే ఈ నిర్ణయానికి పవన్ ఓకే చెప్పాల్సి ఉందట. ఈ క్రమంలో పవన్ అభిప్రాయం ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలా లేదా అన్న విషయంపై క్రిష్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు పవన్ కల్యాణ్ మూవీ లైనప్ కూడా బాగానే ఉంది. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తున్న ఈ స్టార్ హీరో.. 'హరిహర వీరమల్లు'తో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ', హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', అలాగే సముద్రఖని డైరెక్షన్లో రానున్న ఓ సినిమాలోనూ నటిస్తున్నారు.
ఔరంగజేబు రోల్లో బాలీవుడ్ స్టార్..
'హరి హర వీరమల్లు' సినిమాలో ఔరంగజేబు రోల్లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరెక్కతున్న ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాగా గతంలో ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. దీంతో ఆయన ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడనే చెప్పాలి. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">