ఓ భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయటం ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే. కానీ, ఒకప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. దక్షిణాది భాషల్లో హిట్ కొట్టిన పలు చిత్రాలను హిందీలో పునః నిర్మించగా అవి అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'మిలీ'సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ విషయమై స్పందించారు. 'జెర్సీ'(తెలుగు), విక్రమ్ వేద (తమిళం)లను ఉదాహరణగా తీసుకుంటూ.. "ఈ రెండు సినిమాలు ఆయా భాషల్లో హిట్‌గా నిలిచాయి. వాటి రీమేక్ (హిందీ)లు మాత్రం బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది. స్థానికతకు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు (కాపీ- పేస్ట్) తెరకెక్కించడమే ఫెయిల్యూర్‌కు కారణం. పైగా టైటిల్‌నూ మార్చట్లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచి మేరకు స్క్రిప్టును కొంత మారిస్తే ఫలితం ఉంటుంది" అని బోనీ కపూర్ తెలిపారు.
తన కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో బోనీ నిర్మించిన చిత్రమే 'మిలీ'. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ చిత్రం 'హెలెన్'కు రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియరే 'మిలీ'కీ దర్శకుడు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇటీవల, 'గుడ్‌లక్ జెర్రీ'తో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. అది తమిళ సినిమా 'కొలమావు కోకిల' రీమేక్.
ఇదీ చదవండి:'ఆదిపురుష్' సినిమా వాయిదా!.. కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసా?