Avatar 2 ticket booking collection : జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమా సీక్వెల్‌గా "అవతార్-2" ది వే ఆఫ్ వాటర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదలవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా బుకింగ్స్ ఓపెన్ కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే దాదాపు 2 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేశారు. దీంతో ఆల్ ఇండియా మొత్తం రూ.7 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న కేజీఎఫ్2, బాహుబలి2 సినిమాలను సవాలు చేస్తూ ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో అవతార్2 ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్స్‌లో సుమారు లక్షకు పైగా కేవలం పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌లలోనే బుక్ చేసుకోవడం గమనార్హం.
ఇక అవతార్ టికెట్స్ వారంతం బుకింగ్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. వీకెండ్‌లో సుమారు 4.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది త్వరలోనే 5లక్షల మార్కును చేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో వారంతపు గ్రాస్ రూ.16 కోట్లకు చేరింది. మొత్తం అవతార్ సినిమా ప్రీసేల్ బుకింగ్స్ రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అవతార్ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రమోషనల్ టూర్‌లో నిర్మాత జోన్ లాండౌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. "అవతార్ ఐదో భాగం 2028లో వచ్చే అవకాశం ఉంది. అందులో సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచిపని కోసం భూమి పైకి వస్తాయి" అని చెప్పారు.