అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం ప్రతిబింబాలు. జయసుధ కథానాయిక. కె.యస్.ప్రకాశ్‌రావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించారు. పలు కారణాలవల్ల విడుదల కాలేకపోయిన ఈ సినిమా, దాదాపు నలభయ్యేళ్ల తర్వాత ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించాయి సినీ వర్గాలు.
నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ "అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. 1982లో మొదలుపెట్టి ఏకధాటిగా చిత్రీకరణ చేశాం. ఇంకా కొంత భాగం చిత్రీకరణ ఉందనగా అక్కినేని నాగేశ్వరరావుకి గుండెపోటు రావడంతో అమెరికా వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకి ఈ సినిమాని పూర్తి చేద్దామని ఏఎన్నార్ ముందుకొచ్చినా పలు కారణాలతో సాధ్యం కాలేదు. మళ్లీ ఆయనే కల్పించుకుని దర్శకుడు కె.ఎస్.ప్రకాశ్‌రావుని పిలిచి ఈ సినిమాని పూర్తి చేయించారు. కానీ రీరికార్డింగ్ సమయంలో పంపిణీదారులు వెనక్కి వెళ్లడంతో ఆర్థిక పరమైన కారణాలతో విడుదల కాలేదు. అప్పట్నుంచి ఈ సినిమా విడుదల కోసం నేను చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. నిర్మాత రాచర్ల రాజేశ్వర్‌రావు ఈ సినిమా విడుదల చేయడానికి ముందుకొచ్చారు. 250 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగుంది. ఇలాంటి చిత్రం మళ్లీ మళ్లీ రాదు. ఏఎన్నార్ సినిమా విడుదల చేస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాం" అన్నారు రాచర్ల రాజేశ్వర్‌రావు. ఈ కార్యక్రమంలో చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కె.బసిరెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: 'సరోగసీ అంటేనే అది మాటలతో చెప్పలేం.. అనుభవిస్తేకాని అర్ధం కాదు'