Actor Arjun Special Interview: త్వరలో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని ప్రముఖ సినీ నటుడు అర్జున్ తెలిపారు. పాన్ ఇండియా మూవీస్ అంటూ ప్రత్యేకంగా ఏమీలేవని, కథలో సత్తా ఉండి.. క్వాలిటీగా సినిమా తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని నిరూపితమైందని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చిన ఆయన.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
అర్జున్ గారు ఎలా ఉన్నారు?
అర్జున్: దేవుడి ఆశీస్సులతో బాగున్నానండీ.
సినిమా ప్రపంచం ఎలా ఉంది?
అర్జున్: సినీ పరిశ్రమ చాలా బాగుంది. మంచి సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇక ముందు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి?
అర్జున్: నా ఆలోచన ప్రకారం పాన్ ఇండియా సినిమా అంటూ ఏమీ లేదండీ. సినిమా బాగుంటే అన్నిచోట్లకు వెళ్తోంది. కేజీఎఫ్ నిరూపించింది. కన్నడ పరిశ్రమ చిన్నది అనుకున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చిన కేజీఎఫ్ ప్రతిచోట అద్భుతంగా ఆడింది. క్వాలిటీ సినిమా ఇస్తే చూస్తామనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపణ జరిగింది. కొవిడ్ వల్ల జరిగిన మంచిపని ఓటీటీ ప్లాట్‌ఫామ్ రావడం. దీనివల్ల రెవిన్యూ ఎక్కడెక్కడి నుంచి రాబట్టవచ్చో తెలిసింది.
కొవిడ్ తర్వాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే ఆందోళన ఉండేది? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో పరిస్థితి ఎలా ఉంది?
అర్జున్: కొవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రారు, సినిమాలు ఆడవనేది అవాస్తవమని తేలింది. అన్నిచోట్ల మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. తెలుగులోనూ రెండు, మూడు సినిమాలు బాగా ఆడాయి కదా. సినిమా బాగుంటే గ్యారంటీగా ఆడుతుంది. అప్పుడు, ఇప్పుడు ఇది నిర్ధరణ అయింది. ఎప్పటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.
చిన్న సినిమాలు బతకాలంటే ఏం చేయాలి?
అర్జున్: మంచి సినిమాలు చేయాలి. కథ ఎంపిక బాగుండాలి. ప్రేక్షకులు చూస్తున్నారన్న భయం ఉండాలి. ఓటీటీలో ప్రేక్షకుడికి కావాల్సిన అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు నిర్మించిన చిత్రాలు ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు మినిమంలో మాగ్జిమం ఇస్తేనే నిలబడతాయి. ఇదో సవాల్‌తో కూడుకున్నది
మీరు హీరోగా లేదా కీలకపాత్ర చేసిన రాబోయే సినిమాలేంటి?
అర్జున్: నా కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. హీరో విశ్వక్ సేన్. నేను కూడా చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ సహా చాలామంది ఇందులో నటిస్తున్నారు. టైటిల్ త్వరలోనే ప్రకటిస్తాం. మరో రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తెలుగులో కూడా దర్శకత్వం చేస్తాను. కథ కూడా సిద్ధంగా ఉంది. నా కుమార్తె సినిమా పూర్తి అయిన తర్వాత ఈ మూవీ చేస్తాను.
ఇవీ చదవండి: రామ్‌చరణ్ 'RC15'లో స్టార్ డైరెక్టర్.. యుద్ధ వీరుడిగా హీరో సూర్య!