Matrimonial Crimes : మహారాష్ట్ర, దిల్లీ, ముంబయి, పుణే, హైదరాబాద్‌ల్లోని కొన్ని ముఠాలు వివాహ పరిచయ వేదికలంటూ నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి ఒంటరి/వితంతు మహిళలు. మధ్య వయసు పురుషులకు అందమైన తోడును చూపుతామంటూ టోకరా వేస్తున్నారు. బాధితుల్లో అధికశాతం ఉన్నత హోదా/కుటుంబాలకు చెందినవారు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇది మోసగాళ్లకు అనుకూలంగా మారుతోందని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ జి.శ్రీధర్ తెలిపారు. కాస్త జాగ్రత్తగా ఉంటే వీరి భారినపడకుండా తప్పించుకోవచ్చని సూచించారు.
నమ్మకమే పెట్టుబడి
Matrimonial Cyber Crimes : వివాహ పరిచయ వేదికలు, వెబ్‌సైట్లను ఆకట్టుకునేలా రూపొందిస్తారు. వధువు/వరుడు పేర్ల నమోదుకు రూ.1000-3000 ఫీజు వసూలు చేస్తారు. అందమైనవారి ఫొటోలను పంపుతారు. కాల్‌సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులనే కాబోయే వధూవరులుగా పరిచయం చేస్తూ ఫోన్‌లో మాటలు కలిపిస్తారు. కాఫీ షాప్‌లు, హోటల్స్‌లో పెళ్లిచూపులు ఏర్పాటు చేసేవారు. కొద్దిరోజుల తరువాత అభిరుచులు/ఉద్యోగాలు నచ్చలేదంటూ చెప్పిస్తారు.
Matrimonial Cyber Crimes in Hyderabad : పేరున్న మాట్రిమొని వెబ్‌సైట్లలోకి నకిలీ పేర్లు, ఫొటోలతో మాయగాళ్లు ప్రవేశిస్తారు. వివరాలు నచ్చి సంప్రదించే యువతి/యువకులను మాటలతో మభ్యపెడుతూ దగ్గరవుతారు. అకస్మాత్తుగా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ రూ.లక్షలు ఆన్‌లైన్ ద్వారా లాగేసుకుంటారు. ఆ తరువాత ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తారు.
Matrimonial Cyber Crimes in Telangana : ఒంటరి మహిళలు/పెళ్లికాని మగవారిని సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్ల ద్వారా పరిచయం చేసుకుంటారు. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో ఉన్నత ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించామంటూ నమ్మిస్తారు. అక్కడ కూడబెట్టిన సొమ్మంతా భారత్‌కు తీసుకొచ్చి స్థిరపడాలనుకుంటున్నామంటారు. అక్కడ ఏర్పాట్లకు ముందుగా డాలర్లను పంపుతున్నామంటారు. ఆ తరువాత విమానాశ్రయం/నౌకాశ్రయానికి డబ్బు సంచులు వచ్చాయంటూ ఇటువైపు ఉన్నవారికి ఫోన్‌కాల్స్ చేస్తారు. పన్నుల పేరుతో రూ.లక్షలు గుంజుతారు.
సామాజిక మాధ్యమాల పరిచయాలతో స్నేహం చేస్తారు. అవతలి వారి అవసరం, బలహీనతకు తగినట్టుగా మాటలతో బోల్తా కొట్టిస్తారు. వితంతు/ఒంటరి మహిళలైతే తాము కూడా బార్య మరణంతో ఒంటరిగా ఉన్నట్టుగా సెంటిమెంట్ ప్రయోగిస్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితుల నుంచి భారీగా వసూలు చేసి ముఖం చాటేస్తున్నారు.
అపరిచితులతో జాగ్రత్త
తెలియని వ్యక్తుల మాటలకు మోసపోవద్ధు నమ్మి డబ్బు ఇవ్వొద్ధు జాగ్రత్తగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ద్వారా వెబ్‌సైట్లలో నకిలీ వివరాలు, ఫొటోలతో బోల్తా కొట్టిస్తున్న వారిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవమని నిర్దారించుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోవాలి. - జి.శ్రీధర్, ఏసీపీ, సైబర్‌క్రైమ్, సైబరాబాద్
10,000 మందికి టోకరా
నాగ్‌పుర్ కేంద్రంగా వివాహ పరిచయ వేదిక పేరిట నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. శంకరంపల్లిలో వచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. రికార్డులను పరిశీలిస్తే సుమారు 10,000 మంది పేర్లు నమోదు చేసుకున్నట్టు గుర్తించారు.