విశాఖలో అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, రవాణా చేసే షిప్పింగ్ సంస్థ శ్రావణ్ షిప్పింగ్ కార్యకలాపాలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు విశాఖలోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరు బోర్డు ఛైర్మన్ ఉత్తర్వులు ఇచ్చారు. పర్యావరణ, భద్రతాపరంగా అమ్మోనియం నైట్రేట్ నిల్వ విషయంలో శ్రావణ్ షిప్పింగ్ సంస్థ నిబంధనలను పాటించలేదని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. విశాఖ నగర పోలీసు కమిషనర్... శ్రావణ్ షిప్పింగ్‌లో పలు ఉల్లంఘనలు గుర్తించి నాగపూర్‌లోని చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్కి దీనిపై చర్యల కోసం ఇప్పటికే నివేదించారు.
తాజా ఉత్తర్వులతో అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, రవాణాలో గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు చేస్తున్న శ్రావణ్ షిప్పింగ్ సంస్థపై నిషేధం పడింది. అమ్మోనియం నైట్రేట్ నిల్వలలో పర్యావరణ, భద్రతాపరమైన కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా గుర్తించి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు శ్రావణ్ షిప్పింగ్ కంపెనీని అమ్మోనియం నైట్రేట్ ఆధారిత దిగుమతి కార్యకలాపాలను అనుమతించవద్దంటూ విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌ను కూడా కాలుష్య నియంత్రణ మండలి కోరింది.
ఇదీ చదవండి : అమ్మోనియం నైట్రేట్ నిల్వలో ఉల్లంఘనలు