తూర్పు కనుమలు అంటేనే సుందర ప్రకృతికి అలవాలం. అందమైన కొండలు, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచే గిరిజనం ప్రశాంతతకు మారుపేరు. అయితే మత్తు పదార్ధాన్ని పండించే కేంద్రంగా ఈ ప్రాంతం తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన పర్వత ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ జరిగింది. వీటితోపాటే గిరిజన జీవన విధానాలల్లోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు మూడు దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అభివృద్ది పరంగా సంతోషాన్ని ఇస్తున్నా.. మకిలి మరకలు కలవరపెడుతూనే ఉన్నాయి.
నిషేధిత సాగుపై మాఫియ ప్రత్యేక దృష్టి..
ఇక్కడి చల్లటి ప్రకృతి పర్వత పాదాలు.. గంజాయి సాగునకు ఎంతో అనువుగా ఉంటాయి. గిరిజనులు కేవలం తమ వినియోగానికి పరిమితం చేసుకోవడం వారికి తరతరాలుగా ఉంటోంది. దీని ప్రభావం నగరాలకు చేరడంతో మత్తు పదార్థానికి డిమాండ్ పెరిగింది. మాదకద్రవ్యాల నిషేధిత జాబితాలో ఉన్న గంజాయిపై మాఫియా ప్రత్యేకంగా దృష్టిసారించింది. గిరిజనులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ పంట సాగుచేయిస్తున్నారు.
పంటలోనూ ఆధునిక పద్దతులు....
ప్రధానంగా ఏవోబీలో ప్రాంతంలో నిఘా ఇతరత్రా తనిఖీలు దాదాపుగా ఉండవు. స్ధానిక పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది జాడ ఇక్కడ కానరాదు. ఈ ప్రాంతలోనే ఎక్కువగా గంజాయి సాగు చేయిస్తున్నారు. దళారులు.. ఒడిశా, బెంగాల్, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడి గిరిజనులను లోబరుచుకుని ఆధునిక పద్దతులలో గంజాయి సాగు చేస్తున్నారు. విత్తనం తయారీ నుంచి గంజాయి సాగు, దానిని నిర్దేశిత స్ధలానికి అప్పగించే వరకు నిఘా వ్యవస్ధల కన్నుగప్పి రవాణా చేస్తున్నారు. సాగులో ఆధునిక సాగుపద్దతులు వాడుతున్నారు.
మరోవైపు ఉద్యాన శాఖ గంజాయికి ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం వచ్చే ఫలసాయ పంటలను సూచించి ప్రోత్సహిస్తోంది. ఈదిశగా అసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరిగినా.. ఇప్పటికీ ఈ ముఠాల ప్రలోభాలకు తలొగ్గి నిషేధిత సాగు చేస్తున్న అమాయక గిరిజనులే ఉన్నారు.
ఎండిన గంజాయే కాదు...కొత్తగా లిక్విడ్
సాధారణంగా కొన్ని నెలల్లోనే చేతికి వచ్చే గంజాయిని ఎండబెట్టడం ఒక ప్రత్యేక అంశం. ఎండిన తర్వాత గంజాయి వాసన ఎక్కువ అవుతుంది. దీని వాసన ఎవరైనా తేలిగ్గా గుర్తు పట్టేస్తారు. సాధారణంగా రవాణా సమయంలో పట్టించేది ఈ వాసనే. కావున ప్యాకింగ్ సమయంలో మెళకువల ద్వారా వాసన బయటకు రాకుండా ముఠాలు జాగ్రత్త పడుతాయి. గతంలో జరిపిన దాడుల్లో లిక్విడ్ గంజాయి కూడా పట్టుబడడం రవాణాలో ఉపయోగించిన సాంకేతికత బయటపడింది. రవాణా సులువుగా ఉండడం ముఠాలను అటువైపు ఆకర్షించేట్టుగా చేస్తోంది.
రవాణే నే కీలకం...
గిరిజన ప్రాంతం నుంచి గంజాయి ఎగుమతి 99.9 శాతం వరకు వేగంగా సాగిపోతుంది. దీని రవాణాలో గిరిజన యువత నేరుగా పాల్గొంటారు. ఏమాత్రం అనుమానం రాకుండా కూరగాయల వేన్లు, ఇతర సరకుల మధ్యన, బడిపిల్లల ఆటోలు, చివరకు ఆంబులెన్స్ లు వంటివాటి ద్వారా నేరుగా సమీప నగరాలు, పట్టణాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి దేశంలో ప్రధాన నగరాలకు ఈ సరఫరా ఒక చెయిన్ మాదిరిగా వ్యవస్దీకృతంగా సాగుతుంది. అనుమానం రాకుండా గురితప్పకుండా గమ్యస్ధానానికి చేర్చడం ఈ ముఠాల పనే. కొన్ని చోట్ల ముఠాలతో మావోయిస్టులకు సంబంధాలు ఉన్నందున వారు లోపయికారిగా.. మరికొన్నిచోట్ల బహిరంగంగానే దీనికి మద్దతు ఉంటోంది.
ఎక్కువ కేసుల్లో గిరిజనులే....
గంజాయి రవాణాలలో పట్టుబడిన వాహనం యజమాని, రవాణా సిబ్బంది, అంతా గిరిజనులే ఉంటారు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో నిందితులుగా గిరిజన యువతే ఉంటున్నారు. వీరిలో చాలా మందికి ఎక్కువ మొత్తంలో కూలి వస్తుందని వచ్చిన వారే ఎక్కువ. రవాణా చేసేది గంజాయి అని తెలిసిన వాళ్లు కొందరైతే.. తెలియని వాళ్లు ఉన్న సందర్భాలే ఎక్కువ. మొత్తం రిమాండ్ ఖైదీల్లో 40 శాతంపైనే గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న అంశం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్యేక నియంత్రణ..
గంజాయి రవాణా ఒకేసారి పెద్ద కంటైనర్లలో తరలిస్తున్న కేసులు.. ఈడీ ఇటీవల రెండు సార్లు చిక్కడం ఆందోళన కలిగించే అంశం. ఇక ప్రతిరోజూ జిల్లా, సరిహద్దుల్లోనూ ఏదో ఒక వాహనంలో గంజాయి పట్టుబడడం, వాటిపై ఎస్ఈబీ ప్రత్యేక నిఘా బృందాల తనిఖీలు.. ఈ రవాణా ముఠాల కార్యకలాపాలు ఎంత జోరుగాసాగుతున్నాయనడానికి నిదర్శనం. దీన్ని అరికట్టాలంటే బహుముఖ వ్యూహాన్ని తక్షణ అమలు తప్పనిసరి అని ప్రభుత్వాధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి...: బమిడికిలొద్ది లేటరైట్ క్వారీని పరిశీలించిన ఎన్జీటీ కమిటీ