ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఈసారి ఆసక్తి రేపింది. అధికారికంగా విశాఖ ఉత్సవ్ ప్రారంభమే అయినప్పటికీ.. రాజకీయంగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మూడు రాజధానులంటూ వైకాపా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేస్తున్న తరుణంలో.. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయొచ్చంటూ.. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన సందర్భంలో జరుగుతున్న పర్యటన కావడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి విశాఖ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖలో దాదాపు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. విమానాశ్రయం నుంచి.. మానవహారంతో భారీ స్వాగత ఏర్పాట్లు చేయించారు. వైకాపా నేతలు.. ప్రభుత్వ యంత్రాంగం చేసిన భారీ ఏర్పాట్లతో రాజధాని విషయంలో ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడతారనే అంచనాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యమంత్రి మౌనం..
విశాఖలో దిగిన వెంటనే నేరుగా కైలాసగిరి వెళ్లిన సీఎం.. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సాగరతీరంలో విశాఖ ఉత్సవ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ రాజధాని విషయంలో జగన్ నుంచి సంకేతాలు వస్తాయని అంతా భావించారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏమీ మాట్లాడలేదు. రాజధాని విషయమే కాదు.. ఏ సంగతీ మాట్లాడలేదు. "విశాఖ ఉత్సవ్ అధికారికంగా మొదలవుతోంది.." అని కేవలం ఒక్కమాట చెప్పి ప్రసంగాన్ని ముగించారు.
మూడు రాజధానులు
వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు ఆలోచనలో ఉంది. ముఖ్యమంత్రి జగన్.. స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ మాట ప్రస్తావించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ పెట్టుకోవచ్చు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత రెండు రోజులకే ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అదే సూచన చేసింది. ఆ తర్వాత.. అమరావతిలో ఆందోళనలు రేగాయి. రాజధాని తరలిస్తే.. సహించేది లేదంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది.
విశాఖ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి మాటమాత్రంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకపోవటంతో రాజకీయవర్గాల్లోనూ.. స్థానికుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది.
ఇదీ చదవండి :