Sea Turtles are Endangered Due To Pollution in AP : భూభాగంలో ఎంత జీవరాశి ఉందో, అంతకు మించిన జీవరాశి సముద్రంలో ఉంది. సంద్రంలో చేపలు పెరగడానికి, గుడ్లుపెట్టడానికి అనువైన వాతావారణాన్ని తాబేళ్లు కల్పిస్తాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవరాశులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. వీటిలో తాబేళ్లే ముందు వరసలో ఉన్నాయి.
14 వేల మత్స్యకార కుటుంబాలు : రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 132 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. 11 తీరప్రాంత మండలాల పరిధిలో 59 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో 14 వేల మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అటవీ, మత్స్యశాఖలతోపాటు జంతు సంరక్షణ సంస్థల ప్రతినిధులు మత్స్యకారులకు అవగాహన కల్పించడంతో తాబేళ్లను కాపాడడానికి ముందుకొస్తున్నారు. తాబేళ్లను సంరక్షించేందుకు అనకాపల్లి జిల్లాలో ఒక కేంద్రాన్ని, విశాఖపట్నంలో నాలుగుచోట్ల ఏర్పాటుచేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరంలో జిల్లాలో 10 చోట్ల గుడ్ల సేకరణ కేంద్రాలున్నాయి.
జనసంచారంలేని సమయంలో : ప్రతి సంవత్సరం జనవరి నుంచి మే వరకు తాబేళ్లు గుడ్లు పెడతాయి. ఆరేళ్లుగా ఆర్కేబీచ్‌లో ఈ గుడ్లను సంరక్షించిన అనుభవం ఉన్న జంతు సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో గుడ్ల సేకరణ చేపడుతున్నారు. జనసంచారంలేని సమయంలో అంటే రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటలలోపు తాబేళ్లు తీరానికి వచ్చి ఇసుకలో మీటరన్నర లోతులో గుడ్లు పెడతాయి. ఈ తాబేళ్లు ఏవిధంగా వరసలో ఉంచాయో! అదేవిధంగా గొయ్యితీసి పెడితే వాలంటీర్లు పని పూర్తిఅయినట్లే.
150 నుంచి 250 వరకు గుడ్లు : వాటిని ఏ జంతువులు తవ్వకుండా వెదుళ్లతో చుట్టూ రక్షణ దడి నిర్మిస్తారు. ఇలా సంరక్షించిన గుడ్లు సూర్యకిరణాలు వేడి, ఇసుక తాపానికి పిల్లలుగా మారుతాయి. తరువాత వీటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలితే హాయిగా జీవిస్తాయి. ఒక్కో తాబేలు 150 నుంచి 250 వరకు గుడ్లు పెడతాయి. అడవిపందులు, నక్కలు, పక్షులు, కుక్కలు గుడ్లను కనిపెట్టి తినేస్తుంటాయి. వీటిని నివారించి గుడ్లను సేకరించేందుకు ఉత్తరాంధ్రలో 31 చోట్ల 90 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
అటవీశాఖ, జంతుసంరక్షణ సంస్థల ప్రతినిధులు కల్పించిన అవగాహన వల్ల తాబేళ్ల గుడ్ల సేకరణలో భాగస్వామ్యం అయ్యాను. తాబేళ్లు చనిపోతే చేపల ఉత్పత్తి ఎంత మేర ప్రభావానికి గురవుతుందో అవగాహన పొందాను. పారితోషకం ఇచ్చినా ఇవ్వకపోయినా తాబేళ్లు సంరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని నాలుగేళ్లగా చూస్తున్నా! తంతడి-వాడపాలెంలో ఈకేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. మిగిలిన మత్స్యకార గ్రామాల్లోనూ దీనిని ఏర్పాటు చేయాలి. - వంకా కృష్ణారావు, తంతడి-వాడపాలెం, అచ్యుతాపురం
జంతు సంరక్షణే ప్రధానలక్ష్యంగా తాబేళ్లు గుడ్ల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మిగిలిన జంతులతో పాటు అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించడానికి ఉత్తరాంధ్రలో 31 చోట్ల కేంద్రాలను ఏర్పాట్లు చేసి 90 మంది వాలంటీర్లు నియమించాం. ఇప్పటివరకు 486 సంరక్షణ కేంద్రాల ద్వారా 54,140 గుడ్లను సేకరించి 224 పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. భవిష్యత్తులో తీర ప్రాంతాల్లో మరిన్ని కేంద్రాలను పెంచుతాం.- బీఎం దివాన్‌మైదీన్, సీఎఫ్‌ఓ విశాఖ సర్కిల్
ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత - సంరక్షణపై అధికారుల అధ్యయనం
కూర్మానికి ఎంతటి కష్టమొచ్చిందో! - సంతానోత్పత్తి కోసం వచ్చి వేల కొద్దీ మృత్యువాత