విశాఖ వాసులను ఓ చెట్టు భయాందోళనకు గురిచేస్తోంది... ఘాటైన వాసనతో ఊపిరితిత్తులను పిండేస్తోంది. కష్ట సమయంలో ఆదుకుంది అనుకున్న ఏడాకులపాల చెట్టు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.
హుద్‌హుద్ దాటికి విశాఖ కళ తప్పింది. పచ్చదనాన్ని సాధారణం చేసేందుకు అప్పటి వుడా అధికారులు విస్తృతంగా ఏడాకుల మొక్కలు నాటారు. సుమారు 6 లక్షల మొక్కలు నాటినట్లు అంచనా. మొక్కలూ ఎంతో ఏపుగా... ఆకర్షణీయంగా పెరిగాయి. పూతకాలంలో అసలైన చిక్కు ఎదురైంది. గుత్తులు గుత్తులుగా విరబూసిన పువ్వులు వెదజల్లే వాసన భరించడం కష్టంగా మారింది. సాయంత్రం సమయంలో మరీ దారుణం. ఈ వాసనతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
హుద్‌హుద్ సమయంలో ఈ మొక్కలు నాటడానికి ముందు... ఏయూ బోటనీ విభాగానికి చెందిన ఆచార్యులు పరిశోధించి 70కిపైగా స్థానిక రకాల మొక్కలు పెంచాలని సూచించారు. తుపాను దాటికి తట్టుకునే చెట్లు, పక్షులకు అనువుగా ఉండే వృక్ష జాతులు అందులో ఉన్నాయి. వుడా అధికారులు మాత్రం దిగుమతి చేసుకున్న మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపారు. ఫలితంగా మేలు జరగకపోగా... సమస్యలు మొదలయ్యాయి.
నగరంలో తీవ్రమవుతున్న ఏడాకులపాల చెట్ల సమస్యపై జీవీఎంసీ అధికారులు దృష్టి సారించారు. ప్రజల ఫిర్యాదు చేసిన ప్రాంతాల్లో ఈ చెట్ల పువ్వులు తొలగిస్తున్నారు. ఏడాకులచెట్ల సమస్యకు పరిష్కారం చూపాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. వరుసగా నాటిన ఏడాకులపాల చెట్ల మధ్య ప్రత్యామ్నాయ చెట్లు నాటాలని ప్రజలు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. క్రమంగా ఇతర చెట్లు పెంచితే ఏడాకుల చెట్ల ప్రభావం తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి