మాజీ మంత్రి దేవినేని ఉమాపై రాళ్ల దాడి వ్యవహారంపై.. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్పందించారు. దేవినేని ఉమానే.. వైకాపా స్థానిక నేత పాలడుగు దుర్గాప్రసాద్ కారుపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. కారు నడుపుతున్న దళిత యువకుడిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు.
ఓ వైపు వైకాపా నేతలపై దాడి చేసి.. ఇంకోవైపు తన కారుపైనే దాడి జరిగినట్టుగా ఉమా తప్పుడు ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేయటం దేవినేని ఉమాకు అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. జి.కొండూరు పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలో కూడా వైకాపా నాయకుడి కారుపై దేవినేని ఉమా అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డైనట్లు తెలిపారు. ఆయనపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జి.కొండూరు పోలీసు స్టేషన్ వద్ద కూడా ఉమా అనుచరులు రెచ్చిపోయి దాడులు చేశారని ఆరోపించారు. ఆయనే తప్పు చేసి ఇప్పుడు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ధోరణిని మానుకోవాలి: మల్లాది విష్ణు
ప్రజలను తప్పుదోవ పట్టించే ధోరణిని మాజీ మంత్రి దేవినేని ఉమా మానుకోవాలని..వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు హితవు పలికారు. అక్రమ మైనింగ్ ఉంటే.. అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప.. రాత్రి సమయంలో పరిశీలనకు వెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉనికిని అస్థిరపరచాలానే ఉమా ఇలా చేశారని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాల్లో తెదేపాని వ్యతిరేకించినా.. ఆ పార్టీ నాయకులు కుట్ర కోణంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైకాపాకు చెందిన నాయకుల కార్ల అద్దాలను ఉమా వర్గీయులు పగలగొట్టాకని.. మల్లాది విష్ణు ఆరోపించారు..
ఇదీ చదవండి: